Mayor Vijayalaxmi: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ సభ్యులు పదేపదే సభాకార్యక్రమాల్ని అడ్డుకున్నారు. మేయర్ పొడియం దగ్గరుకు దూసుకెళ్లి మరీ ఆందోళన చేశారు. ఫ్లకార్డులను చింపేసి బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో సభ నుంచి బీఆర్ఎష్ సభ్యులను మేయర్ విజయలక్ష్మీ సస్పెండ్ చేశారు.
సభా కార్యక్రమం ప్రారంభం కాగానే బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ కోరారు. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పోడియం దగ్గరకు ఒక్కసారిగా వెళ్లి మేయర్‌పై పేపర్లు చింపివేశారు. మేయర్ ప్రజా సమస్యల గురించి చర్చిద్దామని చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. ఆగ్రహానికి గురైన మేయర్ విజయలక్ష్మీ బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో గందరగోళం మధ్యే జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.
బడ్జెట్ ఆమోదం తర్వాత మేయర్ ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. మేయర్ పొడియం దగ్గరకెళ్లి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన మేయర్ జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. మేయర్ బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్‌ఎస్ ధర్నాకు దిగింది.
Also Read: Delhi Elections: ఢిల్లీ ప్రజలపై అడ్డగోలు ఉచితాలు.. కానీ ఈ డేంజర్ ఇష్యూ పట్టించుకోరేంటి..?
ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా..? ఇది ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎలాంటి చర్చ జరగకుండానే బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదని.. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. మరోవైపు సభను అడ్డుకోవడాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో అలా వ్యవహరించడం సబబు కాదని కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పలు ఆరోపణలు చేశారు.