ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీల గ్లోబల్ ఆఫీస్ లు హైదరాబాద్ లో ఉన్నాయి. ఆ వరుసలోకి మరో ప్రముఖ సంస్థ వచ్చి చేరుతోంది. అదే మెక్ డొనాల్డ్స్ కంపెనీ. అమెరికాకు చెందిన ఈ మల్టీ నేషనల్ కంపెనీ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలసిన ఆ సంస్థ ప్రతినిధి బృందం ఎంఓయూపై సంతకాలు చేసింది. మెక్ డొనాల్డ్స్ సీఈఓ క్రిస్ కెంప్కె జెన్స్కీతోపాటు మరికొంతమంది ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని మెక్ డొనాల్స్డ్ ప్రతినిధులతో చర్చించారు.
2వేల ఉద్యోగాలు..
మెక్ డొనాల్డ్స్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ని ప్రారంభించబోతోంది. ఈ ఆఫీస్ ప్రారంభిస్తే దాదాపు 2వేల ఉద్యోగాలు లభించే అవకాశముంది. సంస్థ విస్తరణలో భాగంగా ఈ ఆఫీస్ ఏర్పాటు కాబోతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 38 మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లు ఉన్నాయి. ప్రతి ఏడాదీ వీటి సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు చేస్తోంది.
సీఎం రేవంత్ సంతోషం..
మెక్ డొనాల్డ్స్ సంస్థ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకి ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రానికి రావాలంటూ ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారని, కానీ మెక్ డొనాల్డ్స్ సంస్థ మాత్రం తెలంగాణను ఎంపిక చేసుకోవడం గర్వంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
In a red-letter day for #Telangana as a global investment destination, growth of industries and empowerment of people through opportunities, Hon’ble Chief Minister @revanth_anumula and Mr Chris Kempczinski, Chairman & CEO, McDonalds, closed a major partnership spanning several… pic.twitter.com/Ueq18evJGt
— Telangana CMO (@TelanganaCMO) March 19, 2025
రాష్ట్ర ప్రభుత్వ ఘనత..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15 నెలల్లో నైపుణ్య అభివృద్ధికోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కార్యక్రమ వివరాలను సీఎం వారికి వివరించారు. ఈ సంస్థకు అవసరమైన ఉద్యోగులను నియమించుకునే విషయంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ సేవలు వినియోగించుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి. ఈ యూనివర్శిటీని పలు సంస్థలు స్కిల్ జోన్ గా ఉపయోగించుకుంటున్నాయని చెప్పారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిని మెక్ డొనాల్డ్స్.. గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, ఇతర ప్రాంతాలు, విదేశాల్లోని ఆ సంస్థ ఆఫీసుల్లో కూడా ఉద్యోగాలివ్వాలని కోరారు.
రైతులకు కూడా ఉపయోగం..
మెక్ డొనాల్డ్స్ సంస్థ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నా.. ఆ సంస్థకు కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మెక్ డొనాల్డ్స్ సంస్థకు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు. దీని ద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు కలుగుతుందని, వారి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పాటు లభిస్తుందని చెప్పారు.