Telangana Govt: తెలంగాణ మహిళల కోసం సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీతక్క.. మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పారు.
తెలంగాణలో మహిళా సంఘాల బలోపేతానికి నూతన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెడుతోంది. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ప్రారంభించిన ప్రభుత్వం, మహిళలకు ఉపాధి కల్పనకై సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మహాలక్ష్మి పేరిట ఫ్రీ బస్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది.
అలాగే కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తోంది. కరెంట్ బిల్ చెల్లించేందుకు ఇబ్బందులు లేకుండా 200 యూనిట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం రేవంత్ సర్కార్ మహిళా సంఘాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదే విషయంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లను చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో, మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఇందిరా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలను ఏడాది పాలనలో ప్రారంభించామన్నారు. అలాగే మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రూ. 21 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చామని, వడ్డీలు చక్ర వడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలికాకుండా వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
మహిళా సంఘాలలో చేరేందుకు 60 ఏళ్లు దాటిన మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వారు కూడా మహిళా సంఘం లో సభ్యులుగా చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. మహిళా సంఘం సభ్యురాలుగా ఉండి ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే వారికి రూ. 10 లక్షల భీమా అందిస్తున్నట్లు సీతక్క ప్రకటించారు. అంతేకాకుండా రైస్ మిల్లులు నడుపుకునే విధంగా మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి అందరికీ సోదరుడిగా అండగా ఉంటూ ప్రజా పాలన సాగిస్తున్నారంటూ మంత్రి చెప్పారు.
Also Read: Women’s Day 2025 Wishes: మీ ఆత్మీయులకు ఉమెన్స్ డే.. స్పెషల్ విషెస్ ఇలా చెప్పేయండి !
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటేనే మహిళలను సమాన పనికి సమాన వేతనం అనే నినాదమని, లింగ వివక్షత ఉండకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక వెసులుబాటు ఆర్థిక ఎదుగుదల వంటి కార్యక్రమాలు చేపట్టి మద్దతుగా నిలుస్తుందన్నారు. మహిళా సంక్షేమానికి పాటుపడుతూ ఇన్ని పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ను మహిళలంతా దీవించాలని మంత్రి సీతక్క కోరారు.