Musi Project: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం మొట్టమొదటి సారి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవం, ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు బుధవారం మరో అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గండిపేట మండలం మంచిరేవులలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,108.27 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 928 ను జారీ చేసింది. ఆలయాభివృద్ధికి రూ.948.65 కోట్లు, ఆలయానికి అనుసంధానంగా ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.159.62 కోట్ల నిధులు కేటాయింపునకు పరిపాలనపరమైన మంజూరీ ఇస్తున్నట్లు సర్కారు జీవోలో పేర్కొంది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జీవో నెంబర్ 928 ను జారీ చేసింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు.
అభివృద్ధిపై సర్కార్ స్పష్టత..
ఆలయ సముదాయంలో ప్రధాన ఓంకారేశ్వర స్వామి ఆలయంతో పాటు వీరభద్ర, భద్రకాళి, లలితా మహా త్రిపురసుందరి దేవి, బాల గణపతి, బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల ఉప ఆలయాలు నిర్మించనున్నారు. మహామండపం, నంది మండపం, ప్రాకారాలు, రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణి, భారీ శివుడి విగ్రహం, భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది. ఆలయ నిర్మాణ పనులకు రూ.598.98 కోట్లు, సివిల్, స్ట్రక్చరల్, ఎంఈపీ, ఇతర అనుబంధ పనులకు రూ.349.67 కోట్లు ఖర్చు చేసేందుకు మంజూరీ ఇచ్చింది. ఆలయానికి అనుసంధానంగా ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు 30 మీటర్ల వెడల్పుతో సుమారు 2.50 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఈ రహదారి ఆలయ సముదాయాన్ని గ్రేహౌండ్స్ భూములు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, మూసీ రివర్ ఫ్రంట్ రోడ్డు నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నట్లు సర్కారు పేర్కొంది.
కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు
ఆలయ సముదాయ అభివృద్ధి పనులకు సాంకేతిక మార్గదర్శకాలు, అనుమతులు, డీపీఆర్‌లు, అంచనాల పరిశీలనతో పాటు ప్రత్యేక ఆలయ నిర్మాణ పనుల రేట్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసినట్లు సర్కారు జీవో నెంబర్ 929 ను జారీ చేసింది. ఈ కమిటీకి ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కో-చైర్మన్‌గా, ఎంఆర్‌డీసీఎల్ చీఫ్ ఇజినీర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఎండోమెంట్స్ శాఖ చీఫ్ ఇంజనీర్, ఆలయ నిర్మాణ నిపుణుడు డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా వ్యవహారించనున్నట్లు సర్కారు ఆదేశాల్లో స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియ, పనుల అమలు, అదనపు పనులు, మార్పులు, నిర్మాణ పరిధిలో మార్పులను కమిటీ పరిశీలించనుంది. ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ అభివృద్ధి, రహదారి నిర్మాణానికి మంజూరైన రూ.1,108.27 కోట్ల నిధులు ఎంఆర్‌డీసీఎల్ బోర్డు ఆమోదానికి లోబడి వినియోగించాలని కూడా సర్కారు పేర్కొంది.
Also Read: పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్