Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: వరంగల్ అభివృద్ధి, కేంద్ర నిధులు, ఎయిర్‌పోర్టు, ఎరువుల సరఫరా తదితర అంశాలపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ..
మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నేత ఏదో చూపించుకోవాలనే ఉద్దేశంతో వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదన్నారు. ఎయిర్‌పోర్టులను మంజూరు చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సిన బాధ్యతను ఇప్పటికే నిర్వర్తించిందని చెప్పారు. వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
రూ. 5 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు సమకూరుస్తోందన్నారు. మొత్తం ప్రాజెక్టులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 25 శాతం కేంద్ర ప్రభుత్వం, మరో 50 శాతం బ్యాంకు రుణం రూపంలో తీసుకుని ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వివరించారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో రూ.5 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు.
Also Read: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట.. కేసులు కొట్టివేసిన కోర్టు!
బండి సంజయ్ పై మంత్రి విమర్శలు
స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిధులు వినియోగం కాక వెనక్కి వెళ్లినా దానికి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్‌లో మెజారిటీ లేకుండా మేయర్ అవుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలవకుండా చైర్మన్, మేయర్ ఎలా అవుతారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
వరంగల్ అభివృద్ధి లక్షంతో సీఎం కీలక నిర్ణయాలు
హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. ఎయిర్‌పోర్టు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ పనులు, డంప్ యార్డు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఎరువుల సరఫరాపై బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ఎరువులు తయారు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతులకు పంపిణీ చేయడం మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఎరువుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
కేంద్రపై విమర్శలు
తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.10 వెళ్తే తిరిగి కేవలం రూ.3 మాత్రమే వస్తున్నాయని, మిగతా రూ.7 కేంద్రం వద్దే మిగిలిపోతున్నాయని విమర్శించారు. సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ నేతలు అవమానించేలా వ్యాఖ్యలు చేశారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ ఓట్లే కారణమని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచిందో చెప్పాలని ప్రశ్నించారు.
Also Read: రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడికీ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తెలంగాణకు బీజేపీ చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలని, పగటి కలలు కంటూ అధికారంలోకి వస్తామని చెప్పడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.