Director Selection: స్వేచ్చ బ్యూరో: వైద్య విధాన పరిషత్ కొత్త సారథి ఎవరనే దానిపై వైద్య ఆరోగ్య శాఖతో పాటు సచివాలయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక పోస్టును దక్కించుకునేందుకు సీనియర్ సివిల్ సర్జన్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ ఆసక్తికరo గా మారింది.. ఇప్పటికే వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ పోస్టు కోసం అర్హత కలిగిన 10 మంది అత్యంత సీనియర్ డాక్టర్ల వివరాలతో కూడిన జాబితాను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. ఈ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంవో పరిశీలన అనంతరం ఫైనల్ లిస్ట్ ముఖ్యమంత్రి టేబుల్ మీదికి వెళ్లనుంది.
సాధారణంగా ఇలాంటి కీలక బాధ్యతలు అప్పగించేటప్పుడు వివాద రహితులకు, సమర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈసారి ‘లెఫ్ట్ ఓవర్ సర్వీస్’ ప్రాతిపదికన ఈ 10 మంది జాబితాను రూపొందించినట్లు సమాచారం.కనీసం ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.తద్వారా కొత్తగా వచ్చే బాస్ కనీసం కొంతకాలమైనా పూర్తిస్థాయిలో సంస్థపై పట్టు సాధించి, సంస్కరణలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Also read: Temple Administration: తెలంగాణలో టెంపుల్ రూల్స్ మారుస్తూ.. సర్కార్ సంచలన నిర్ణయం!
గతంలో ఈ పోస్టు కేవలం ఒక విభాగపు అధిపతి లాగా మాత్రమే ఉండేది. కానీ ఇటీవల కాలంలో వైద్య విధాన పరిషత్ పరిధిని, నిధులను, ఆసుపత్రుల పర్యవేక్షణ బాధ్యతలను పెంచారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రులు దీని పరిధిలోనే ఉంటాయి. ఒక రకంగా ఈ పోస్టు కార్పొరేట్ స్థాయిలో పవర్‌ఫుల్‌గా మారడంతో దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. బడ్జెట్ కేటాయింపులు, బదిలీలు, నియామకాల్లో ఈ పోస్టుకు కీలక పాత్ర ఉండటమే ఈ పోటీకి ప్రధాన కారణం.
జాబితాలో ఉన్న 10 మంది సీనియర్లు ఎలాగైనా ఈ కుర్చీని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించడంతో పాటు, మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారుల ద్వారా సీఎంవో వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాము చేసిన సేవలను, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ 10 మంది అధికారుల ట్రాక్ రికార్డ్, గతంలో వారిపై ఏవైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? అన్న కోణంలో నిఘా విభాగం ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతా సజావుగా ఉండి, ముఖ్యమంత్రి తుది అనుమతి ఇచ్చిన వెంటనే నూతన బాస్ ఎవరనేదానిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Also rad: ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!