SLBC Tunnel Accident Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 18 రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒకే ఒక్క మృతదేహం వెలికితీశారు. అయితే ఇవాళ రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి హైదరాబాద్ కు చెందిన అన్వీ రోబో బృందం వెళ్లింది. టన్నెల్ లోపల రోబోలతో తవ్వే ప్రయత్నం చేశారు. క్యాడవార్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల ఇప్పటికే అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇవాళ రాత్రి వరకు రెండు మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.
కేరళ రాష్ట్రానికి చెందిన క్యాడవర్ డాగ్స్ డెడ్ బాడీల ఆనవాళ్లు పసిగట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. అతి కష్టం మీద సహాయక సిబ్బంది మరో ఐదు అడుగులు తవ్వకాలు జరిపింది. ఇంజనీర్ మృతదేహాన్ని ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటుగా మరో ముగ్గురు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవాళ మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉంది. మిగిలిన వారు సొరంగం చిట్ట చివరి భాగం దగ్గర టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. టన్నెల్‌లో ప్రస్తుతం టీబీఎం మిషన్ కట్టింగ్, డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
అన్వీ రోబోటిక్ బృందం ఒక రోబోతో టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్‌లో రోబోను ఎలా ఉపయోగించాలన్న అంశంపై డెమో నిర్వహించనుంది. డెమో తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్‌లోకి మరో రెండు రోబోలను రంగంలోకి దింపే యోచనలో అధికారులు ఉన్నారు. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, హైదరాబాద్ అన్వీ రోబోటిక్ టీమ్‌తో ఈ ఆపరేషన్ కొనసాగనుంది. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2వ స్పాట్‌లో ఏడుగురి ఆచూకీ కోసం తవ్వకాలు జరుపుతున్నామని.. ప్రస్తుతం షిఫ్ట్‌ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు.
ఈ రోజు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ కంపెనీ బృందంతోపాటు.. 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా టన్నెల్ లోకి వెళ్లారు. అక్కడ పరిస్థితులను బట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కాగా.. ఎస్ఎల్‌బీసీ సొరంగం లోపల నీరు, బురదతో సహా పరిస్థితులు సవాలుగా మారడంతో, రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం రోబోలను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. సహాయక చర్యలలో అనుసరించాల్సిన విధి విధానాలు, రోబోటిక్స్, పరికరాల వినియోగం, బురద మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై అధికారులు చర్చించారు. అనంతరం సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు.
టన్నెల్ లోపల జరిగే సహాయక చర్యలలో రోబోలను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన AI బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్ ను సంస్థ ప్రతినిధులు లోకో ట్రైన్ లో సొరంగంలోకి వెళ్ళారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు దగ్గర ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా రోబోలను వినియోగిస్తున్నట్లు వివరించారు.
ALSO READ: Minister Komati Reddy: ఆర్‌ఆర్ఆర్‌పై నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు: మంత్రి కోమటిరెడ్డి
మనుషులు చేరుకోలేని ప్రదేశానికి రోబోను పంపి సహాయక చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతోపాటు నీటి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.