Sangareddy: సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో తీవ్ర విషాదం అలముకుంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో శోకసంద్రం అలుముకుంది.
బట్టలు ఉతికేందుకు వెళ్లి..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి, ఆయన భార్య కృష్ణవేణి, సోదరుడు సంగారెడ్డి తమ కుటుంబంలోని ఒక చిన్నారితో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకునే క్రమంలో అనుకోకుండా ఒకరు ప్రమాదవశాత్తు కుంటలోని లోతైన నీటిలో జారిపడ్డారు. వారిని కాపాడేందుకు మిగతా వారు కూడా వరుసగా దిగడంతో ఈ ఘోరం జరిగిందని సమాచారం.
సాహసంతో ప్రాణాలు దక్కించుకున్న బాలుడు
ఈ ప్రమాదంలో నర్సింహారెడ్డి, ఆయన భార్య కృష్ణవేణి, సోదరుడు సంగారెడ్డి ముగ్గురూ నీటమునిగి మృతిచెందారు. అయితే వారితో పాటు వచ్చిన చిన్న బాలుడు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. కుంట ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోకుండా బయటపడగలిగాడు.
ఆసుపత్రిలో చికిత్స.. నింగికెగసిన రోదనలు
తీవ్ర భయాందోళనతో పాటు నీటిని మింగడంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడిని స్థానికులు గమనించి తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో బంధువుల, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్