Dasara Gift: రండి బాబు.. రండి .. ఆలోచించొద్దు.. సూపర్ కానుక.. అంటూ దసరా కానుకలు పంచారు. ప్రతి ఏడాది దసరాకు వెరైటీ కానుకలు అందించే అలవాటున్న ఈయన.. ఈ ఏడాది కూడా అదే పంథా కొనసాగించారు. అందుకే ఆయన ఇంటి వద్ద క్యూ సాగింది నేడు. ఇంతకు ఆయన ఇచ్చిన కానుకలు ఏమిటో తెలుసుకుందాం.
ఈయన ఒక ప్రముఖ సామాజిక వేత్త. నిరంతరం ప్రజలకు ఏదొక కానుకలు ఇవ్వడం ఈయనకు అలవాటు. అందుకే కాబోలు దసరాకు కూడా ప్రత్యేకమైన కానుకలు అందించారు. ఆయనెవరో కాదు వరంగల్ శివారులోని చింతల్ కు చెందిన శ్రీనివాస్. పండుగ అంటే కానుకలు స్వీట్స్, ఏదైనా వస్తువులు ఇస్తారు. శ్రీనివాస్ అయితే వినూత్నంగా కానుక ఇవ్వాలని భావించారు. అందుకే గ్రామంలో దసరా కానుక అందించనున్నట్లు ప్రకటించారు.
ఇక కానుక అనగానే.. అదేమి కానుకో అనుకున్న ప్రజలకు శ్రీనివాస్ షాకిచ్చారు. ఆయన ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా.. కోడి.. కోడితో పాటు మసాలా.. కూరగాయలు. ఇలా కానుకలు ఇస్తున్న విషయం ఒక్కసారిగా ప్రచారం సాగింది. క్యూ కట్టారు.. తలా ఒక కోడి. మసాలా ప్యాకెట్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఇంటిబాట పట్టారు అక్కడి ప్రజలు. ఈ వెరైటీ కానుకను అందుకున్న ప్రజలు మాట్లాడుతూ.. పండుగ రోజు కోడిని ఉచితంగా ఇవ్వడమే కాక.. కూరగాయలు కూడా అందజేయడంతో పండుగ ఖర్చులు కొంత తగ్గాయని తెలిపారు. శ్రీనివాస్ ప్రతి ఏడాది ఇలా కానుకలు ఇస్తుంటారని, కానీ ఈ ఏడాది కోళ్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రజలు.
Also Read: Kondareddy Palli : కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ… దసరా గూస్ బంప్స్
కాగా ఈ ఉచిత కోళ్ల పంపిణీ గురించి లేటుగా సమాచారం అందుకున్న పలువురు చివర్లో రాగా.. వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దీనితో నిరుత్సాహంగా వెనుతిరిగి వెళ్లారు. అయితే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను ప్రతి పండుగకు పేదలకు తనవంతు సాయం అందిస్తానన్నారు. అందులో భాగంగా దసరాకు ఇలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. పండుగ అంటేనే ఆనందంగా జరుపుకొనే సంబరం. పేద, ధనిక అనే తేడా లేకుండా ఆనందంగా జరుపుకోవాలన్నదే తన లక్ష్యం అన్నారు.
ఏదిఏమైనా ప్రతి పండుగకు కానుకలు అందించే శ్రీనివాస్.. నెక్స్ట్ పండుగకు ఇక ఏ కానుక ఇస్తారో అంటూ ప్రజలు చర్చించుకోవడం అక్కడ కనిపించింది. అలాగే శ్రీనివాస్ కు కొందరు వృద్దులు అయితే ఆశీర్వదించగా.. మరికొందరు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండి.. సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఎంతైనా పండుగ రోజు ముక్క రుచి చూపించారుగా.. ఆ మాత్రం దీవెనలు అందించాల్సిందేగా !