Nursing Council: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సుమారు రూ.7 కోట్ల నిధులు మిస్సైనట్లు సమాచారం. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అప్‌గ్రేడేషన్ కోసం విడుదలైన ఈ నిధులపై స్పష్టమైన లెక్కలు లేకపోవడంతో ఉన్నతాధికారులు కూడా అవాక్కవుతున్నారు. నిధులు పక్కదారి పట్టాయా? గోల్ మాల్ జరిగిందా? అని ఎంక్వైయిరీ చేస్తున్నారు. 2023వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అప్‌గ్రేడేషన్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 7 కోట్ల నిధులను కేటాయించింది. నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు, ఆధునిక ల్యాబ్ పరికరాల ఏర్పాటు లక్ష్యంగా ఈ ఫండ్స్ విడుదలయ్యాయి. కానీ ఆ నిధుల ఖర్చుపై సరైన ఆధారాలు, లెక్కలు లేకపోవడంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కౌన్సిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇటీవల కోఠి వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన అధికారుల రివ్యూలో ఈ అంశం తెరమీదకు వచ్చింది. రూ.7 కోట్ల నిధులకు సంబంధించిన లెక్కలు సమర్పించాలని డీఎంఈ..కౌన్సిల్ అధికారులకు సూచించగా, ఆయా ఆఫీసర్లంతా మౌనం వహించినట్లు తెలిసింది. వెంటనే ఈ నిధుల వినియోగానికి సంబంధించిన ఆధారాలు, ఆడిట్ నివేదికలు, బిల్లులు, రికార్డులు సమర్పించాలని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ .. కౌన్సిల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏఏ పనులకు ఎంత ఖర్చు చేశారో తనకు స్పష్టంగా లెక్కలు కావాలని డీఎంఈ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిధుల కేటాయింపు, వినియోగంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారు. అయితే, కౌన్సిల్ ఆఫీసర్లు మాత్రం ఈ నిధులన్నీ ప్రాజెక్టు పనుల కోసమే ఖర్చయ్యాయని చెప్పినా..రికార్డులు మాత్రం సబ్మిట్ చేయకపోవడం గమనార్హం.
Also read: భర్త, కూతురు చనిపోయారు.. ఒక కన్నుకు తీవ్ర గాయం.. అయినా గ్రూప్స్ పరీక్ష రాసి 2వ ర్యాంక్
ఈ నిధుల వ్యవహారంపై డీఎంఈ విచారణ సమయంలోనే నర్సింగ్ కౌన్సిల్ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ లీవ్‌లో వెళ్లడం హా ట్ టాఫిక్ గా మారింది. విచారణ నుంచి తప్పించుకునేందుకే సెలవుపై వెళ్లారనే చర్చ కూడా కౌన్సిల్ వర్గాల్లో సాగుతోంది.నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తు, నర్సింగ్ కళాశాలల అభివృద్ధి కోసం కేంద్రం పంపిన కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? గతంలోని అధికారుల జేబుల్లోకి వెళ్లాయా? ఆ నిధులు ఖర్చులో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉన్నదనే అంశాన్ని రాబట్టి, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నర్సింగ్ అసోసియేషన్ లు, విద్యార్ధి సంఘాలు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే సీఐడీ ,సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు రికార్డులు మాయం చేసిన అధికారులు, నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రికవరీ చేయాలని స్పష్టం చేస్తున్నారు.
Also read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్ కావాలా? ఈ బ్యాంక్ కార్డులు తప్పనిసరి