Telangana Govt: విద్యార్థుల కోసం కీలకమైన చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాస్మొటిక్స్ చార్జీల డబ్బులు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తగిన నిధులు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
బుధవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. విద్యార్థుల సమస్యలపై అధికారులతో చర్చించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అవసరాలను గుర్తించారు. ఆయా విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
కాస్మొటిక్స్ చార్జీలకు సంబంధించిన నిధులు విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థుల అవసరాలు తీరుతాయని అంటున్నారు. నిధుల వినియోగంపై పర్యవేక్షణ మరింత ఈజీ కానుందని తెలిపారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచేందుకు ఇదొక ముఖ్యమైన అడుగుగా వర్ణించారు.
జూన్ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా విద్యార్థుల ఆధార్ నెంబర్, ఫోటోలతో బ్యాంకు అకౌంట్లను అనుసంధానించి వారికి డెబిట్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు సీఎస్. ఈ విధానం వల్ల విద్యార్థులు తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకుంటారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన కాస్మొటిక్స్ వస్తువులు అంటే సబ్బు, షాంపూ, తల నూనె, పేస్ట్, బ్రెస్ మొదలైనవి.
ALSO READ: వరద కష్టాలకు చెక్, యాక్షన్ ప్లాన్ రెడీ, రంగంలోకి 400 టీమ్స్
జూన్ చివరి నాటికి విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీనివల్ల ఏ ఒక్క విద్యార్థి కాస్మొటిక్స్ ఛార్జీల విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్-DBT ద్వారా జరిగేలా చేయాలని ముఖ్యమంత్రి సూచన చేసినట్టు వెల్లడించారు.
మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనివల్ల మహిళా సంఘాలు నిర్వహించే మొబైల్ విక్రయ కేంద్రాల ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
ఈ విధానం వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అవకాశం కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందబోతున్నారు. అలాగే ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ చెల్లింపులు, తదితర అంశాలపై కూడా సమీక్ష చేపట్టారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.