TGPSC: గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం సుమారు 400 మంది జాగృతి కార్యకర్తలు, నాయకులు రెండు విడతలుగా టీజీపీఎస్సీని ముట్టడించి ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లోపాలతో గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించిన విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ఎత్తి చూపిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు అన్యాయం చేసే జీవో నం.29 నుంచి మొదలుకొని ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అన్నింటా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు గ్రూప్ -1 పోస్టులను అమ్మకానికి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం పంతానికి పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరిపి వారు కోరుకున్నట్టుగా తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మ బలికి నిలువునా ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందని జాగృతి నాయకులు మండిపడ్డారు. అసెంబ్లీలో జాబ్ లెస్ బోగస్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ: Rammohan Reddy: ఆ కారణంతో త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు ఠాణాలకు తరలించారు. టీజీపీఎస్సీ గేటు ఎక్కేందుకు ప్రయత్నించిన నాయకులను లాఠీలతో కొట్టారు. అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో పలువురు జాగృతి నాయకులకు గాయాలయ్యాయి. అరెస్టు చేసిన తెలంగాణ జాగృతి నాయకులను నాంపల్లి, అబిడ్స్, గాంధీ నగర్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ALSO READ: ADE Ambedkar: మొత్తం రూ.200 కోట్లకు పైగా ఆస్తి.. ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్