Medical Stipends: స్వేచ్ఛ బ్యూరో: గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ భారీగా డెవలప్ అయింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. అయితే వైద్య ,విద్యారంగం ఊహించని రీతిలో విస్తరిస్తున్న కొద్దీ ప్రభుత్వ ఖజానాపై మాత్రం ‘స్టైఫండ్ల’ భారం మోయలేని స్థాయికి చేరుతోంది. ఒకవైపు సీట్ల సంఖ్య భారీగా పెరగడం,మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే అర్హత కలిగిన డాక్టర్ల వేతనాల కంటే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో చదివే మెడికోలకే అధిక మొత్తంలో స్టైఫండ్లు చెల్లిస్తుండటంతో సర్కార్పై ఏటా కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. దీనికితోడు విదేశాల్లో చదువుకుని వచ్చిన మెడికల్ గ్రాడ్యుయేట్లు సైతం ప్రభుత్వ దవాఖాన్లలోనే ఇంటర్న్షిప్ కావాలంటూ తెస్తున్న ఒత్తిళ్లు తెస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తే స్టైఫండ్ వస్తుందనే ఉద్దేశ్యంతో సర్కార్ కు ప్రెజర్ పెడుతున్నారు. అంగీకరించని పరిస్థితుల్లో ధర్నాలకు దిగుతున్నారు. ఇప్పుడు ఈ అంశం పరిష్కారం సర్కార్ కు సవాలుగా మారింది.
ప్రైవేట్ హాస్పిటల్స్ వాల్యూ కంటే ఎక్కువే..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వేతన పరిస్థితికి, ప్రభుత్వం చెల్లిస్తున్న స్టైఫండ్లకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి ఎంబీబీఎస్ డాక్టర్లకు సగటున నెలకు ఇచ్చే జీతం రూ. 20 వేల నుంచి 25 వేలు మాత్రమే ఉండగా,ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదివే హౌస్సర్జన్లకు ప్రభుత్వం నెలకు రూ.30 వేలు వరకు స్టైఫండ్గా చెల్లిస్తోంది.ఇక పీజీ పూర్తి చేసిన డాక్టర్లకు ప్రైవేట్ రంగంలో నెలకు సగటున రూ. 50 వేల నుండి రూ.70 వేలు వరకు ఉండగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ విద్యార్థులకు ఏకంగా నెలకు లక్ష రూపాయలకు పైగా స్టైఫండ్ అందజేస్తున్నారు. ప్రైవేట్ దవాఖాన్లలో వైద్య సేవలు అందించే పూర్తిస్థాయి వైద్యుల కంటే మెడికల్ కాలేజీల్లోని హౌస్ సర్జన్లు, పీజీ మెడికోలకే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం సుమారు 4,500 ఎంబీబీఎస్ సీట్లు, 1,500 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ 5 సంవత్సరాల కోర్సు లో సుమారు 22,500 మంది విద్యార్థులు, పీజీ 3 ఏళ్ల కోర్సులో 4,500 మంది మెడికోలకు నిరంతరం స్టైఫండ్ చెల్లించాల్సి ఉన్నది. గతంలో పోల్చితే భారీగా పెరిగిన సీట్లతో ప్రతీ నెల స్టైఫండ్ కోసం వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించాల్సి ఉన్నది.
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల ఇంటర్న్షిప్ రగడ..
ఓవైపు రాష్ట్రంలోనే అవసరానికి మించి డాక్టర్లు తయారవుతున్నారనే ఇప్పటికే విమర్శలు ఉండగా, విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన వారి సమస్య సర్కార్ కు చిక్కుముడిగా మారింది.విదేశాల్లో చదివి వచ్చిన విద్యార్థులు తమకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.మానవీయ కోణంలో వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్షిప్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే.. వారు ఇక్కడి స్థానిక మెడికోలతో సమానంగా తమకూ స్టైఫండ్ చెల్లించాలంటూ ధర్నాలు, ఆందోళనలకు దిగడం హాట్ టాఫిక్ గా మారింది. ఈ ధోరణి పట్ల ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
లీగల్ చిక్కులు లేవు.. రద్దు చేయడమే మార్గం..
ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇటీవల ప్రభుత్వానికి కీలక రిపోర్టు ఇచ్చారు. విదేశీ మెడికల్ గ్రాడ్యూయేట్లకు ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో ఇచ్చే ఇంటర్న్షిప్లను తక్షణమే రద్దు చేయాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు ఫారిన్ గ్రాడ్యుయేట్ల అవసరం ఏమాత్రం లేదని,వారి వల్ల రోగులకు అదనంగా జరిగే ప్రయోజనమేమీ లేదని రిపోర్టులో పొందుపరిచారు. ఖజానాకు అనవసరమైన ఆర్థిక భారం మాత్రం ఉంటుందని వివరించారు.ప్రస్తుతం ఇంటర్న్షిప్ చేస్తున్న వారిని నిబంధనల ప్రకారం తొలగించడానికి ఎలాంటి లీగల్ సమస్యలు కూడా రావని, స్పష్టంగా చట్టపరమైన నిబంధనలు కూడా ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి వివరించారు. అయితే ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఇష్యూను స్టడీ చేసిన తర్వాతనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నది.
Also Read: బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?