Ramchander Rao: స్వేచ్చ బ్యూరొో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో 1 జూలై 2025న ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన, ఈ ఒక సంవత్సర కాలంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో, ప్రజా పోరాటాలను నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యంతో పాటు దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన, వివాదరహితుడైన క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ న్యాయవాది రామచందర్ రావును బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు.
రాంచందర్ రావు నేతృత్వంలో బీజేపీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు సాగించింది. హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బాధితులకు అండగా ఉంటూ క్షేత్రస్థాయి ఆందోళనలు చేపట్టారు. సింగరేణి కాలరీస్ నుంచి దాదాపు 15 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే ఆరోపణలపై సిట్టింగ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, నిరుద్యోగ భృతి మరియు మహిళలకు ఆర్థిక సాయం అందించడంలో విఫలమైందని రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రక్రియలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
పార్టీని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ స్థాయికి విస్తరించడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచేలా రాష్ట్రవ్యాప్తంగా 9 నూతన బీజేపీ జిల్లా కార్యాలయాలను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో కలిసి ప్రారంభించారు. సీనియర్ నేతలను, యువ కార్యకర్తలను సమన్వయం చేస్తూ టీమ్ బీజేపీ గా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగారు. ఘట్‌కేసర్‌లో భారీ ఎత్తున రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేశారు.
Also read: మార్కెట్‌ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!
గడచిన ఏడాది కాలంలో రాంచందర్ రావు గారు బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు శిక్షణ, బూత్ స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఎన్నికల సన్నద్ధత, సమాయత్తంలో రాంచందర్ రావు వ్యూహాలు ప్రత్యర్థులకు పెను సవాళ్లుగా మారాయి. ఆయన సారథ్యంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. ఒక వర్గం ఓట్లు కేంద్రీకృతమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీకి సవాలుగా నిలిచింది. అయినప్పటికీ రాంచందర్ రావు స్ఫూర్తిదాయక నాయకత్వ వ్యూహంతో బీజేపీ తన ఓట్ షేర్ ను పదిలంగా కాపాడుకుంది. ఇకపోతే.. పంచాయతీ ఎన్నికల విషయానికొస్తే.. అర్బన్ పార్టీగా విమర్శించేవారికి గ్రామీణ స్థాయిలో పార్టీ బలంగా ఉందని సర్పంచ్ ఎన్నికలు చాటిచెప్పాయి. గతంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 163 స్థానాల్లో గెలవగా.. రాంచందర్ రావు నాయకత్వంలో ఈసారి 600కు పైగా స్థానాల్లో గెలిచారు.
ఇకపోతే.. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ 15.45 శాతం ఓట్ షేర్ తో పాటు 5.9 లక్షల ఓట్లు సాధించింది. తొలిసారిగా కార్పొరేషన్ గెలిచి కరీంనగర్లో చారిత్రక విజయం నమోదు చేసింది. నారాయణపేట్, ఖానాపూర్, భైంసా చైర్మన్ పదవులను కూడా బిజెపి సాధించగలిగింది. ఇదిలా ఉండగా ప్రతి బీజేపీ కార్యకర్తకూ ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించేలా వర్క్ షాప్ ను నిర్వహించారు. ఎస్ఐఆర్ విధానం, ఓటర్ లిస్ట్ ధృవీకరణ, బూత్ స్థాయి కో-ఆర్డినేషన్ బీఎల్ఏ-1, బీఎల్ఏ-2 టీంల పాత్రపై అవగాహన కల్పించడంలో రాంచందర్ రావు కృషిచేశారు. రాంచందర్ రావు నాయకత్వంలో ఏడాది కాలంలో బీజేపీ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుంది. ఆయన వ్యూహాల వల్ల వివిధ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల సన్నాహకాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మక కమిటీలను ఏర్పాటు చేసి విజయాల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు.
Also read: భాగ్యనగరానికి ఏమైంది? కళ్లముందే ఐటీ కంపెనీలు.. చేతిలో డిగ్రీలు.. అయినా దొరకని ఉద్యోగాలు