Paddy Procurement: వానకాలం వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ గత వానకాలం, యాసంగి సీజన్లలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లోనే ఇంకా భారీగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారు? ఏ మిల్లులకు కేటాయిస్తారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో మార్కెట్లకు ధాన్యం పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడం, గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, తూకం, రవాణా తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. అయితే ధాన్యం సేకరణకు మిల్లులే కీలకం కావడంతో సీఎంఆర్ బకాయిల పరిష్కారం ప్రధాన అంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా 3000 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. పిల్లలకు కేటాయించిన ధాన్యం మూడు నెలల్లో సీఎంఆర్ తీసుకోవాలి. వానకాలం ధాన్యం కేటాయించినప్పటికీ. ఇంకా 35 నుంచి 40% ధాన్యం ఇంకా పెండింగ్ లోనే ఉంది. యాసంగి ధాన్యం 80% ఇంకా మిల్లుల నుంచి సీఎంఆర్ రావాల్సింది. గత వానకాలం, యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించింది. దానికి అనుగుణంగా బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే కొంత ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇంకా పూర్తిగా రాకపోవడంతో మిల్లుల వద్ద నిల్వలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాత నిల్వలు పూర్తిగా ఖాళీ కాకుండానే కొత్త ధాన్యం వస్తే నిల్వ సామర్థ్యంపై ఒత్తిడి పెరిగే అవకాశముంది.
Also Read: ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత
మిల్లులకు గతంలో కేటాయించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ఎప్పటిలోగా రావాలి? ఎంత మేరకు వచ్చింది? ఇంకా ఎంత బకాయి ఉంది? అనే అంశాలపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. బకాయిలను వేగంగా రాబట్టకపోతే కొత్త సీజన్‌లో ధాన్యం దిగుమతికి మిల్లుల సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. దీంతో పాత సీఎంఆర్‌ను పూర్తిచేయడంపై యంత్రాంగం ఎంత మేరకు చర్యలు తీసుకుందన్నది చర్చనీయాంశంగా మారింది.
వరి కోతలు మొదలవుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ, తూకం, రవాణా, నిల్వ ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైస్ మిల్లర్లు బంద్ పాటిస్తున్నారు. సీఎంఆర్‌కు సంబంధించిన సమస్యలు, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నట్లు మిల్లర్ల వర్గాలు చెబుతున్నాయి. మిల్లుల సహకారం లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించడం, నిల్వ చేయడం అధికారులకు సవాలుగా మారే అవకాశం ఉంది. వాన కాలంలో కేటాయించిన ధాన్యం కింటాకు 67 కి రావాల్సి ఉండగా 62 కేజీలు మాత్రమే వస్తుండడం.. రా రైస్ మాత్రం 35 నుంచి 40 కేజీలు మాత్రమే వస్తున్నట్లు రైస్ మిల్లర్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు క్వింటా ధాన్యానికి బిల్లింగ్ చేసినందుకు పది రూపాయలు మాత్రమే గిట్టుబాటు కావడం లేదని పక్క రాష్ట్రం మాదిరిగా 30 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం సైతం రంగు మారుతుండడం.. తరుగు అవుతుండడం.. పాత గన్ని బ్యాగులకు 28 రూపాయలు కట్ చేస్తుండటం.. 11రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోవడం తో మిలర్స్ మాత్రం సమ్మె ను వీడటం లేదు. సమ్మె ను ఈనెల 9 నుంచి కొనసాగిస్తున్నారు.
అత్యంత కీలకంగా మారిన అంశం మిల్లుల కేటాయింపు. గత సీజన్ల ధాన్యం, సీఎంఆర్ బకాయిల పరిస్థితి ఉండగానే కొత్తగా కొనుగోలు చేసే ధాన్యాన్ని ఏ మిల్లులకు కేటాయిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. పాత బకాయిలు ఉన్న మిల్లర్లకే మళ్లీ కేటాయింపులు చేస్తారా? లేక సీఎంఆర్ విషయంలో నిర్దిష్ట ప్రగతి ఉన్న మిల్లులకు మాత్రమే అవకాశం ఇస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు గోదాముల్లో స్టాక్ ఉండటం.. ధాన్యం ను ఎలా నిల్వ చేస్తారనే.. మిల్లులకు ఎలా కేటాయిస్తారనే చర్చకు దారితీసింది.
కోతలు మొదలైన ప్రాంతాల్లో రైతులు ధాన్యాన్ని త్వరగా విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వారం నుండి కొనుగోలుకు సన్నద్ధమవుతుంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరిగినా, మిల్లులకు తరలింపులో సమస్యలు వచ్చినా ధాన్యం మార్కెట్ల వద్దే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాల పేరుతో కొనుగోళ్లలో జాప్యం జరగకుండా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
కొత్త పంట మార్కెట్‌కు వచ్చే సమయానికి పాత ధాన్యం నిల్వలు, సీఎంఆర్ బకాయిలు, మిల్లర్ల బంద్.. ఈ మూడు అంశాల మధ్య ప్రభుత్వం చేపట్టే సమన్వయమే కీలకం కానుంది. కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయడమే కాకుండా ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలి, ఏ మిల్లులకు ఎంత కేటాయించాలి, పాత సీఎంఆర్‌ను ఎలా రాబట్టాలి అన్నదానిపై స్పష్టమైన కార్యాచరణ అవసరం. గత ఏడాది యాసంగిలోనే రైతులు కొనుగోలు సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానిని అధిగమించేందుకు సివిల్ సప్లై శాఖ అధికారులు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం ఎలా కొనుగోలు చేస్తారనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది.
Also read: నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!