Traffic Rules: స్వేచ్చ బ్యూరో: ట్రాఫిక్ నియంత్రణను మెరుగు పరచటంతోపాటు యాక్సిడెంట్ల నివారణ కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు రావాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల కోసం కొత్త రూల్స్‌ను ప్రతిపాదించింది. వీటి అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు ప్రస్తుతం పరిశీలన జరుపుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటుంది. పీక్ టైం అయిన ఉదయం సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాహనదారులు చాలామంది ట్రాఫిక్ నిబంధనలను పాటించక పోవటం ముందుకు వెళ్లటమే లక్ష్యంగా కనీసం ట్రాఫిక్ లేన్లను కూడా పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జాంలు సర్వసాధారణమయ్యాయి. గంటల తరబడి ట్రాఫిక్ జాంలలో చిక్కుకుని వాహనదారులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇక, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపటం వంటి కారణాలతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
Also read: Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!
వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించటం జాంలు కాకుండా చూడటం కోసం ట్రాఫిక్ పోలీసులు పని చేస్తున్నారు. అయితే, వీరిలో పలువురు అసలు డ్యూటీ వదిలేసి మొబైల్ ఫోన్లు చూడటంలోనే బిజీగా ఉంటున్నారు. సిగ్నళ్లు ఉన్న ఏ చౌరస్తాలో చూసినా ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. ఆటోమేటిక్ సిగ్నళ్లు ఉండటంతో ఇక తమకేం పని అన్నట్టుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. సిగ్నళ్లను చూసి వెళతారులే అని అనుకుంటూ మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తున్నారు. వాట్సాప్ చాటింగులు చేస్తున్నారు. తెలిసిన వారితో మాట్లాడుతూ సమయం గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది ఈ అలసత్వాన్ని అవకాశంగా చేసుకుంటూ వాహనదారులు గ్రీన్ సిగ్నల్ పడక ముందు రయ్యిన దూసుకుపోతున్నారు. దాంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు ట్రాఫిక్ స్తంభించిపోతోంది.
ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించటానికి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సిబ్బంది సెల్ ఫోన్ వినియోగించే అంశంపై సీరియస్ గా దృష్టి సారించారు. డ్యూటీలో ఉన్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ తీసుకు రాకుండా నిబంధనను అమల్లోకి తీసుకు రావాలని యోచిస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా వీఎచ్ఎఫ్ సిగ్నలింగ్ సామర్థ్యాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి ట్రాఫిక్ పోలీసుకు వీఎచ్ఎఫ్ సెట్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. కొత్త విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే త్వరలో నూతన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also read: NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!