Rice Exports: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం కేవలం ధాన్యం పండించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా అవతరించబోతోంది. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న విస్తృత అవకాశాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోబోతోందని స్పష్టం చేశారు.
ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు.. తెలంగాణ కొత్త విధానం
సాధారణంగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కానీ, అది ఎగుమతుల కోసం కాదు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఎగుమతులను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు సరికొత్త విధానంతో ముందుకు వెళ్తోందని మంత్రి తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఎగుమతులు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌తో పోలిక
వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి అద్భుతమని మంత్రి కొనియాడారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లోనే తెలంగాణ ప్రభుత్వం 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు మాత్రమే జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పారదర్శకంగా రూ.19,303 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.
మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లను కలిపి చూస్తే బియ్యం ఉత్పత్తి ఏకంగా 300 లక్షల మెట్రిక్ టన్నులు (300 ఎల్‌ఎంటీలు) దాటింది. నిజానికి తెలంగాణ ప్రజల వార్షిక వినియోగం కేవలం 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. దీనివల్ల తెలంగాణ ఇప్పుడు భారీ మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగింది.
Also Read: కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్
విలువ జోడింపు.. సాగునీటి విప్లవం
రైస్ పరిశ్రమ కేవలం సాధారణ విక్రయాలకే పరిమితం కాకుండా మల్టీ విటమిన్ రైస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయాలని, ఆధునిక సాంకేతికతను స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, నిరంతర నీటి లభ్యత వల్లే ఈ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, రైస్ మిల్లింగ్ పరిశ్రమను బలోపేతం చేయడం ద్వారా తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.