Health Scheme: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య హెల్త్ స్కీమ్, హెల్త్ కేర్ ట్రస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఉపాధ్యాయుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నట్లు చెప్తున్న నూతన హెల్త్ స్కీమ్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ పథకం అమలు తీరుపై, ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నూతన హెల్త్ స్కీమ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా విడుదల చేయలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుడుతున్నాయి. చాలా విషయాల్లో ప్రాథమిక విషయాలపైనే స్పష్టత కరువైందని, అయినప్పటికీ, ఉపాధ్యాయుల వేతనాల నుంచి ప్రీమియం మొత్తాన్ని కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రూల్స్ చెప్పకుండానే డబ్బులు ఎలా కోస్తారంటూ వారు నిలదీస్తున్నారు.
నగదు రహిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఏయే కార్పొరేట్ ఆస్పత్రులు ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇలాంటి పథకాల వల్ల ఆస్పత్రులకు బిల్లులు సకాలంలో చెల్లించక, యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఉచిత వైద్యం నిరాకరించిన చేదు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆస్పత్రులతో కుదిరిన ఒప్పందాల వివరాలను బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల నుంచి డబ్బులు మినహాయించేటప్పుడు వారి సమ్మతి తీసుకోవడం కనీస బాధ్యత. కానీ, ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జీవోలు జారీ చేయడంపై ఉపాధ్యాయ లోకం ఆగ్రహంతో ఊగిపోతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, ఇలా బలవంతపు వసూళ్లకు పాల్పడటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
Also read: కొండాపురంలో గ్రామ పంచాయతీ పైసలు మాయం.. కార్యదర్శిపై ఎంపీడీవోకు ఫిర్యాదు..!
ఈహెచ్ఎస్ స్కీమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల వద్ద కాంగ్రెస్ సర్కార్ మాయ చేస్తోందంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి, దానికి ఉద్యోగుల జీతం నుంచి 1.5 శాతం ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనలు విధించడంపై గుర్రుగా ఉన్నారు. ఒకే నెలలో రెండుసార్లు డబ్బులు కట్ అయ్యాయని, ఆ డబ్బులు ఎటు పోతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ కార్డుల కోసం ఉద్యోగుల నుంచి కమీషన్ పద్ధతిలో డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహంగా ఉన్నారు. అన్ని నిబంధనలు ప్రకటించి, హెల్త్ కార్డుల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాతనే జీతం నుంచి కోతలు మొదలు పెట్టాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సర్వీసులో ఉన్నంత కాలం ప్రతి నెల మూల వేతనం నుండి 1.5 శాతం నిధులు కట్ చేసి, రిటైర్ అయిన మరుక్షణం నుంచి హెల్త్ స్కీమ్‌ను వర్తింపజేయకపోతే రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా ఏదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నూతన హెల్త్ స్కీమ్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని, కార్పొరేట్ ఆస్పత్రుల జాబితాను ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం ముదరకముందే.. రాష్ట్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపుతుందా? లేదా అనేది చూడాలి.
Also Read: ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ