Indiramma Houses: పేదవారి సొంతింటి కలను నేరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పథకాన్ని ప్రవేశ పెట్టింది. అదే ఇందిరమ్మ ఇళ్ల పథకం. పేదవారికి ఒక గూడు ఉండాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో ఎన్నో సామాన్య కుటుంబాల కల నెరవేరనుంది.
పథకంతో సాయమెలా?
తెలంగాణలో పేద ప్రజల ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన “ఇందిరమ్మ ఇళ్ల పథకం 2025” ప్రజలలో కొత్త ఆశలు నింపుతోంది. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఉచిత స్థలం, రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించే ఈ పథకం, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పేదలకు నివాసం కల్పించడం రాష్ట్రం అభివృద్ధిలో కీలక భాగంగా భావించిన ప్రభుత్వం, ఈ పథకాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టితో రూపొందించింది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వడం వల్ల, వారికి గౌరవప్రదమైన జీవనవిధానాన్ని కల్పించేందుకు ఈ పథకం సహకరిస్తోందని చెప్పవచ్చు.
నిబంధనలు ఇవే..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన నిబంధనలు, విధానాలు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకం కింద ప్రభుత్వం అందించే సొమ్మును సరైన రీతిలో వినియోగించకపోతే, నిర్మాణం నిలిచిపోవచ్చు లేకుంటే ఆర్థిక సహాయం నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. నిర్మాణం ప్రారంభానికి ముందే స్థలాన్ని ప్రభుత్వం గుర్తించాలి. లబ్ధిదారుడు గల స్థలం పక్కాగా తన పేరున కలిగి ఉండాలి. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించాలంటే అర్హత ఉండాలి. సరైన ప్లాన్ ప్రకారం మాత్రమే నిర్మాణం జరగాలి. పక్కా గోడలు, టైల్ లేదా సిమెంట్ పైకప్పు ఉండాలి. ప్లాస్టర్, డోర్లు, విండోలు పూర్తిగా ఏర్పాటు చేయాలి.
ఇతర ప్రైవేట్ భవనాల తరహాలో కాకుండా ప్రభుత్వ సూచనల ప్రకారం నిర్మించాలి. కొలతలు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం ఉండాలి. మంజూరు చేసిన మొత్తాన్ని విడతలుగా ఇవ్వబడుతుంది. ప్రతి విడత పొందేందుకు నిర్దిష్ట దశలో ఫోటోలు, వివరాలు సమర్పించాలి.
అధికారుల పరిశీలన ఎప్పుడెప్పుడు?
స్థలం పరిశీలన కోసం మండల స్థాయి ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు వస్తారు. ఆధార్, రేషన్ కార్డు, స్థల డాక్యుమెంట్లు పరిశీలిస్తారు. పునాది పూర్తైన తర్వాత మంజూరైన మొదటి విడత మొత్తాన్ని ఇవ్వడానికి, కట్టడ నిర్మాణ పురోగతిని స్థలానికి వచ్చి పరిశీలిస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు పరిశీలన జరుపుతారు. ఫైనల్ బిల్లును మంజూరు చేయడానికి వివరాలు సేకరిస్తారు.
Also Read: Heavy Rain Alert: రైతన్నలకు వర్షాల గిఫ్ట్.. నైరుతి వానలు ముందే.. IMD ప్రకటన..
ఇవి పాటించండి
అక్రమ నిర్మాణాలు, పటిష్టం లేని గోడలతో నిర్మాణం చేపడితే పథకానికి అనర్హత ఖాయం. ప్రభుత్వ స్థలాన్ని వ్యక్తిగతంగా అమ్ముకోవడం లేదా లీజుకి ఇవ్వడం నిషేధం. ఇల్లు పూర్తయిన తర్వాత ఉపయోగించకపోతే, ప్రభుత్వానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు పాటించగలిగితే, ఇందిరమ్మ ఇల్లు మధుర జ్ఞాపకాల నిలయం అవుతుందని చెప్పవచ్చు. ప్రజలు తమ కలల గూడు నిర్మించుకునేందుకు ఇది ఓ విలువైన అవకాశంమని ప్రభుత్వం అంటోంది.
ఈ పథకం అమలుతో, గతంలో ఇల్లు అనే కలగా మాత్రమే మిగిలిపోయిన లక్షలాది కుటుంబాలకు ఇది నిజమైన మలుపుగా అనుకోవచ్చు. పక్కా ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఇది కేవలం ఒక గృహ నిర్మాణ పథకం మాత్రమే కాదు, పేద కుటుంబాల ఉన్నతికి బాట వేస్తోన్న మార్గం. మరెందుకు ఆలస్యం.. ప్రభుత్వం కల్పిస్తున్న భరోసాతో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.