Hyderabad News: భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. గురువారం రాత్రి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిచి ముద్దైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యా యి. రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యంగా కూకట్‌పల్లి, ప్రగతినగర్, వివేకానందనగర్, మియాపూర్, మూసాపేట, శేరిలింగంపల్లి, గండిమైసమ్మ, లకిడికాపూల్, సికింద్రాబాద్, ఉప్పల్, మెహిదీపట్నం, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది.
వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రెండు లేదా మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జలమండలి విభాగం అప్రమత్తమంది. వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.
ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు, ఎస్పీటి వాహనాలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆ విభాగం ఎండీ అశోక్‌రెడ్డి. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టింది.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డిపై ఏఐ వీడియో వైరల్
నీరు నిలిచే ప్రాంతాలపై ఆయా బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనుక్షణం క్షేత్ర స్థాయిలో సిబ్బందితో అధికారులు పర్యవేక్షించుకోవాలని ఆదేశించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
డీప్ మ్యాన్ హోళ్ల దగ్గర సీవరేజి సూపర్‌వైజర్లు ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ-హైడ్రా-పోలీస్ శాఖల సమన్వయంతో వ్యవహరించాలన్నారు. అలాగే సిటీవాసులు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని సూచన చేశారు.
మరోవైపు పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. వర్షాల వల్ల తలెత్తుతున్న సమస్యకు గల కారణాలను క్షేత్ర స్థాయిలో ప్రజలను తెలుసుకున్నారు. కేబీఆర్ పార్కు, నందినగర్, జలగం వెంగళరావు పార్కులోని చెరువులోకి చేరే వరద కాలువను పరిశీలించారు.
4 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా.. రెండు మీటర్లకు పరిమితమవ్వడాన్ని పరిశీలించారు. వర్షాలకు ఎగువ నుంచి నుంచి వస్తున్న వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెప్పారు. నాలాను కూడా ఆక్రమించడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి వచ్చే వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.