TPCC Strategy: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలని తిప్పికొట్టేందుకు టీపీసీసీ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు ఉమ్మడిగా, విడివిడిగా పన్నుతున్న వ్యూహాలను చిత్తు చేసేందుకు పక్కా ‘యాక్షన్ ప్లాన్’ను రూపకల్పన చేసింది. ఆ రెండు పార్టీలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేందుకు జిల్లాకో ఇంటెలెక్చువల్ సెల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ సెల్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరగకుండా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు కౌంటర్లు ఇచ్చేలా వ్యవహరించనున్నది. ఇందుకోసం గురువారం గాంధీభవన్ లో ప్రత్యేక మీటింగ్ జరిగింది. టీపీసీసీ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో పార్టీ , ప్రభుత్వ ప్రాముఖ్యతలను వివరిస్తూ, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పాటించాల్సిన స్ట్రాటజీలపై టీపీసీసీ వివరణ ఇచ్చారు. స్టేట్ కమిటీతో పాటు జిల్లా టీమ్స్ సమన్వయంతో ముందుకు సాగాలని నొక్కి చెప్పారు.
ప్రభుత్వ పనితీరు,అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అసంతృప్తి పెంచేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక అందించాయి. ముఖ్యంగా ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలిపివేయడానికి, కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టించడానికి కొన్ని శక్తులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయని ఇంటిలిజెన్స్ అలర్ట్ చేసింది. ప్రతిపక్షాల ఈ కుట్రలను ఉపేక్షిస్తే ప్రభుత్వ ఇమేజ్‌కు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు, ఇతర సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ గుర్తించింది. దీంతోనే వాస్తవిక విషయాలను ప్రజల్లో ఉంచడం ద్వారా ప్రభుత్వానికి డ్యామేజ్ జరగదని సర్కార్ భావిస్తుంది.
Also Read: చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
లబ్ధిదారులకు అందుతున్న లబ్ధిని గణాంకాలతో సహా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా స్థాయిలో మీటింగ్ లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాల విజయవంతమైన అమలును నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు డిజిటల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల ఫేక్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిర్ణయించారు. మరోవైపు యువతను, నిరుద్యోగులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ రీ-ఆర్గనైజేషన్, నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరుగుతున్న తీరును నిరుద్యోగులకు వివరించనున్నారు. ప్రతిపక్షాలు వేస్తున్న కోర్టు చిక్కులను అధిగమించి, నియామక ప్రక్రియను వేగవంతం చేయడమే ఏకైక సమాధానమని స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపక్షాల కుట్రలను మేధోపరంగా, సిద్ధాంతపరంగా ఎదుర్కొనేందుకు టీపీసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ‘ఇంటెలెక్చువల్ సెల్’ను ఏర్పాటు చేయాలని సూచించింది.జిల్లా స్థాయిలో రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులతో ఈ సెల్ పనిచేస్తుంది.జిల్లా స్థాయిలో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వీరు ఎప్పటికప్పుడు విశ్లేషించి, సరైన సమాచారంతో ప్రెస్ మీట్లు, చర్చా వేదికల ద్వారా నిజాలను ప్రజలకు వివరిస్తారు.రాజకీయ విమర్శలను కేవలం రాజకీయంగానే కాకుండా, మేధోపరంగా, పక్కా ఆధారాలతో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, పాలనా ఫలాలను ప్రజలకు నేరుగా చేరవేసేలా ఈ యాక్షన్ ప్లాన్ అమలు కానుంది.
Also Read: రాహుల్‌గాంధీకి ఇష్టమైన బీజేపీ నేత ఆయనే.. ఆస్క్ మీ ఎనీథింగ్‌లో ఆసక్తికర సమాధానాలు