Uttam Kumar: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగించలేకపోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని, ప్రాజెక్టును కొనసాగిస్తే ప్రమాదమని అంతర్జాతీయ, జాతీయ నీటి నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు. కేటీఆర్ కన్నా ఎన్డీఎస్‌ఏ అధికారులకు నాలెడ్జ్ ఎక్కువగా ఉందని తాను అనుకుంటున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను సరిచేయకుండా నీళ్లు స్టోరేజ్ చేసినప్పుడు కూలిపోతే కింద ఉన్న 40 ఊర్లు, భద్రాచలం కొట్టుకుపోతుందని ఇంజనీర్లు చెప్పారన్నారు. అందుకే నీరు నిల్వచేయడం లేదని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టకుండా మేడిగడ్డ వద్ద నిర్మించి తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. లేకపోతే ఎప్పుడో ఉత్తర తెలంగాణ సస్యశామలం అయ్యేదని వివరించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది గులాబీ పార్టీనే అని ఆగ్రహించారు.. కాంగ్రెస్‌కి మంచి పేరు వస్తుందనే కారణంతో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకి డిజైన్ మార్చారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పై మంత్రి ఫైర్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన నిర్మాణ లోపాలను దాచిపెట్టి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంను బీఆర్ఎస్ చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రచార సాధనంగా మార్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, ఇప్పుడు అదే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని కన్నేపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదు.. అసలు చేయలేం.. శాస్త్రీయ పునరావాసం పూర్తయ్యే వరకు 3 బ్యారేజీలను నిర్వహించరాదని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించింది.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే నిర్ణయం ఈ ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోదని స్పష్టం చేశారు.
రాజకీయ కోణం కాదు.. ఇంజినీరింగ్ కోణం
కాళేశ్వరం సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ఇంజినీరింగ్ కోణంలో చూడాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యమన్నారు.మూడు బ్యారేజీల పునాదులన్నీ అనుమానాస్పదమే అన్నారు. సెకెంట్ పైల్ కట్-ఆఫ్ వాల్‌ల బలహీనతలు, పునాదుల కింద సీపేజ్, పైపింగ్, స్టిల్లింగ్ బేసిన్ల లోపాలు, నాణ్యతా వైఫల్యాలు, శక్తి వ్యయ నిర్మాణాల బలహీనతలు వంటి అనేక కీలక సమస్యలను నివేదిక గుర్తించిందన్నారు.
ప్రాజెక్టు రూపకల్పన మార్పు
ఇది ఒక్క పిల్లర్ సమస్య కాదు… ఒక్క గేట్ సమస్య కాదు… మొత్తం బ్యారేజీ పునాది వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అమలు చేసి ఉంటే ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా సుమారు 80 టీఎంసీల స్థిర నీటి భద్రత లభించేదని కానీ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రాజెక్టు రూపకల్పనను మార్చడం వల్లే నేటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల అసలు రూపం అమలై ఉంటే ఎల్‌నినో వంటి పరిస్థితుల్లో కూడా ఉత్తర తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కొనేది కాదని ఆయన చెప్పారు.
Also Read: చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!
మహారాష్ట్రతో చర్చలు
స్వార్థం, అత్యాశ, సాంకేతిక రాజీల ఫలితమే నేటి కాళేశ్వరం సంక్షోభమని వ్యాఖ్యానించారు. మూడు బ్యారేజీలపై గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు వంటి అత్యాధునిక పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.ఈ పనులను పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్, అంతర్జాతీయ కన్సల్టెంట్ ఏఎఫ్ఆర్ వై, ఐఐటీ బొంబాయి, ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్‌లను ఖరారు చేసి, వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.జూలై–ఆగస్టు 2027 నాటికి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అప్పటి వరకు మూడు బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో స్థితిలోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణతో పాటు టుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుమారు 80 టీఎంసీల నీటిని తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను వేగవంతం చేసిందని తెలిపారు. డీపీఆర్ సిద్ధమవుతోందని, మహారాష్ట్రతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోం
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ, సాగునీరు, తాగునీటి రంగాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.ప్రజల ప్రాణాలు, ప్రజాధనం, భవిష్యత్ నీటి భద్రతలలే మా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతాంశాలని ఆయన పునరుద్ఘాటించారు. శాస్త్రీయ పునరావాసం పూర్తై ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చిన తర్వాతే మూడు బ్యారేజీలు నిర్వహణలోకి వస్తాయని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు.
పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారు…
పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వ్యాఖ్యానించారు. రూ.1.81లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు ఇచ్చారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టులు అన్ని అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఉల్టా చోర్ కొత్వాల్‌కు దండే అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ హయాంలోనే.. కూలిపోయింది వాళ్ల హయాంలోనే అని ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చారని ప్రస్తావించారు. కన్నెపల్లి పంపు దగ్గరకు పోయి ప్రాణహిత పంపు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ నాటకాలు ఆడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా కడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగించలేకపోతున్నామన్నారు.ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ప్రముఖ టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన