Fertilizer App: స్వేచ్చ బ్యూరో: రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతులకు పారదర్శకంగా యూరియాను అందించేందుకు రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. సాంకేతికతను రైతు సంక్షేమంతో అనుసంధానం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు.
రైతులకు ఎరువుల లభ్యతపై ఎలాంటి సందిగ్ధత లేకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ ప్రతిరోజూ జిల్లాల వారీగా యూరియా నిల్వలు, అమ్మకాలు, కొనుగోలు, అందుబాటు తదితర వివరాలతో బులెటిన్లు విడుదల చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ పారదర్శక విధానం వల్ల రైతులకు వాస్తవ సమాచారం నేరుగా చేరుతోందని, పుకార్లు, తప్పుడు ప్రచారాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రతి జిల్లాలోని పరిస్థితిని ప్రజల ముందుంచడం ద్వారా ప్రభుత్వంపై రైతుల విశ్వాసం మరింత బలపడుతోందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అమ్ముడైందన్నారు.ఇప్పటివరకు 17.70 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోగా, మొత్తం 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్ అయ్యాయి. వీటిలో ఇప్పటికే 52.86 లక్షల బ్యాగులను రైతులు కొనుగోలు చేశారన్నారు.
Also read: హైదరాబాద్‌లో ‘సర్’ అస్తవ్యస్తం.. పది రోజులు గడిచినా అందని ఓటరు ఫారాలు!
రైతులు తమకు సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియా అందుబాటులో ఉందో లేదో ముందుగానే తెలుసుకొని బుకింగ్ చేసుకునే అవకాశం కలగడంతో అనవసర ప్రయాణాలు, వేచి ఉండాల్సిన పరిస్థితులు గణనీయంగా తగ్గాయని మంత్రి వివరించారు. ఎరువుల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలక సంస్కరణ భూమి ఆధారిత అనుసంధాన విధానమని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఆధార్ ఆధారంగా జరిగిన పంపిణీలో తలెత్తిన అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, రైతు సాగు చేస్తున్న భూమి వివరాలతో యూరియా పంపిణీని అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల నిజమైన సాగుదారుకే ఎరువు అందేలా వ్యవస్థ రూపొందిందని, ఇది దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచిందన్నారు.
ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, ఒకే వ్యక్తి పలుమార్లు యూరియా కొనుగోలు చేయడం, ఎరువులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వంటి అక్రమాలకు గట్టి అడ్డుకట్ట పడిందని మంత్రి తెలిపారు. ఫెర్టిలైజర్ యాప్ అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి యూరియా బ్యాగు కదలికపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని, ఏ డీలర్ దగ్గర ఎంత నిల్వ ఉంది, ఎంత విక్రయమైంది, ఎంత మిగిలి ఉందనే సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వస్తోందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 68 వేల మంది రైతులు యూరియాను బుక్ చేసుకున్నారనిమంత్రి తెలిపారు. వారు 4.69 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసుకోగా, ఇప్పటికే 3.38 లక్షల బ్యాగులను కొనుగోలు చేశారనివెల్లడించారు. డిజిటల్ విధానాన్ని రైతులు ఎంత వేగంగా స్వీకరిస్తున్నారో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలపై ప్రస్తుతం వ్యవసాయశాఖ విస్తృత స్థాయిలో ప్రయోగాలు నిర్వహిస్తోందని తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను ఒకే వేదికపై అందించే సమగ్ర డిజిటల్ వ్యవస్థలతో పాటు, పంటల పర్యవేక్షణ, భూసార నిర్వహణ, ఎరువుల పంపిణీ, వాతావరణ సమాచార సేవలు, వ్యవసాయ సలహాలను మరింత ఆధునికంగా అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, పారదర్శకంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, సమాచారం, సాంకేతిక సేవలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని, రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని మంత్రి కోరారు.