Vegetable Prices: స్వేచ్ఛ బ్యూరో: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే నిత్యవసర ధరలు విపరీతంగా పెరగడం ఒక ఎత్తైతే కూరగాయల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నడంతో సామాన్య, పేద ప్రజలు విలవిలలాడుతున్నారు. ధరలు ఇలా ఉంటే కోనేదెట్ట తినేదిట్టా అంటూ బెంబేలెత్తుతున్నారు. వారం, పది రోజుల్లోనే మార్కెట్ లో కూరగాయల ధరలు రెట్టింపవడంతో మార్కెట్ లో రూ. 500 నోట్ తీసుకెళితే కనీసం వారానికి సరిపడా కూరగాయలు రాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే టమాటా కిలో 80 పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు 40 వరకు లభించిన టమాటా ఇప్పుడు డబుల్ కావడంతో వినియోగదారులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గకపోవడం, కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం లాంటి కారణాలతో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల పంటలు సాగు చేసే వారి సంఖ్య తగ్గడం, ఒకవేళ సాగుచేసినా దిగుబడి తగ్గిపోవడం కూడా కారణం అవుతోంది.బీన్స్ ధరలు అయితే 150 కు కేజీ పాకడంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు.
జిల్లాలో అత్యధికంగా రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయల సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో సాగు అమాంతం తగ్గిపోయింది. జిల్లాలో మల్దకల్ మండలంలోని శేషంపల్లి,తాటికుంట తో పాటు పలు గ్రామాలు, ధరూర్ మండలంలో జాంపల్లి తో పాటు సమీప గ్రామాల రైతులు అధికంగా కూరగాయల సాగు చేస్తుంటారు. అటు అలంపూర్ తాలూకాలోని మునగాల, జింకల పల్లె,కొండేరు, జిల్లడుదిన్నె, పచ్చర్ల,తనగల ఇతర గ్రామాలలో సైతం కూరగాయల పంటలపై ఆసక్తిగల రైతులు సాగు చేస్తున్నారు. ఏటా వర్షాకాలంలో కూరగాయల సాగు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతం ధరలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంట సాగుకు వాతావరణం అనుకూలించక పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో వినియోదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
Also read: ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?
కూరగాయల సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి ప్రోత్సహించాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. ఫలితంగా కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పామాయిల్ సాగును ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అదే విధంగా కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల్లో నీటివసతి ఉన్న కొద్దిపాటి రైతులే కూరగాయలు సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూరగాయలు సాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రోత్సాహకాలు సైతం రైతులకు అందడం లేదు.
ప్రస్తుతం మార్కెట్ లో ఏ కూరగాయలు కొందామన్న ధరలు విపరీతంగా మండుతున్నాయి. సామాన్య జనానికి అందుబాటులో లేని ధరలు ఉన్నందున కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతినిత్యం కూరగాయల్లో వేసే మిర్చి ఘాటు ఎక్కుతోంది. టమాటా ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అల్లం నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు పెరగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
Also Read: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?