Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రచారం పూర్తిగా పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత–గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తధనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మెడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసు లు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి BRS ప్రతినిధులు వాగ్విదానికి దిగారు.
మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు. నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్ పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Also Read: రెస్టారెంట్ స్టైల్ హనీ చిల్లీ పొటాటో సీక్రెట్ రెసిపీ.. ఈ ఒక్క చిట్కా తెలిస్తే చాలు!
గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు నాయుడు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంటే, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ‘రైతు పోరుబాట’ ఉద్యమాన్ని చేపడతామని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్ షిండే,పుట్టమధు, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Also read: రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?