India’s Most Dangerous Roads: భారత్ భౌగోళికంగా ఎంతో వైవిధ్యమైన దేశం. ఒకవైపు సముద్రతీరాలు ఉంటే.. మరోవైపు వేల అడుగుల ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు ఉన్నాయి. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో రహదారులు నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన కొన్ని రోడ్లు ప్రకృతి అందాలను చూపిస్తూనే.. డ్రైవర్లకు చుక్కలు చూపెడతాయి. ఇరుకైన దారులు, ప్రమాదకరమైన మలుపులు, భారీ లోయలు, మంచు, కొండచరియలు లాంటి కారణాలతో దేశంలోని కొన్ని రోడ్లు అత్యంత ప్రమాదకరమైన మార్గాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి రోడ్లలో ముఖ్యమైన ఐదు మార్గాలు ఇవే..
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన ఈ పర్వత మార్గం అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కొండలను తొలిచి నిర్మించిన ఈ రహదారి చాలా ఇరుకుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన సరైన సేఫ్టీ వాల్స్ కూడా కనిపించవు. ఒకవైపు ఎత్తైన కొండ.. మరోవైపు లోతైన లోయ.. కింద చీనాబ్ నది.. ఉండటంతో ఇక్కడ డ్రైవింగ్ చేయడం సవాల్ తో కూడుకున్న వ్యవహారం. చిన్న పొరపాటు జరిగినా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని ‘డెత్ రోడ్’ అని కూడా పిలుస్తారు.
శ్రీనగర్-లేహ్ మార్గంలో ఉన్న జోజి లా పాస్ సముద్ర మట్టానికి సుమారు 11,575 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. భారీగా మంచు కురవడం, బలమైన గాలులు, బురద, ఇరుకైన రోడ్లు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం లాంటి సమస్యలు ఉంటాయి. శీతాకాలంలో పరిస్థితులు మరింత డేంజరస్ గా ఉంటాయి.
తమిళనాడులోని కొల్లి హిల్స్ రోడ్ దక్షిణ భారతంలో సవాలుతో కూడిన ఘాట్ రోడ్లలో ఒకటి. ఈ మార్గంలో సుమారు 25 నుంచి 26 కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు 70 హెయిర్ పిన్ మలుపులు ఉంటాయి. ఒక మలుపు దాటగానే మరో మలుపు ఎదురవుతుండటంతో డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అనుభవం ఉన్న డ్రైవర్లకు కూడా ఈ రహదారిపై ప్రయాణం అంత సులభం కాదు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హిందుస్తాన్-టిబెట్ రోడ్‌గా పేరుగాంచిన నేషనల్ హైవే 22 కూడా ప్రమాదకరమైన మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కొండలను తొలిచి నిర్మించిన రోడ్డు కావడంతో ఇక్కడ బోలెడు ప్రమాదకర మలుపులు కనిపిస్తాయి. రోడ్డు పక్కనే లోతైన లోయలు ఉండటం, కొండల నుంచి రాళ్లు పడే అవకాశం ఉండటం వల్ల వాహనదారులు చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్గానికి ‘హైవే టు హెల్’ అనే పేరు కూడా వినిపిస్తుంది.
సిక్కింలోని ఈ రహదారి పాత సిల్క్ రూట్ లో భాగంగా చెప్పబడుతుంది. సముద్ర మట్టానికి సుమారు 9,400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మార్గంలో తక్కువ దూరంలోనే అనేక జిగ్-జాగ్ మలుపులు ఉంటాయి. దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో 100కు పైగా మలుపులు ఉండటంతో డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. ఎత్తైన ప్రాంతం కావడంతో వాతావరణ పరిస్థితులు కూడా ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి.
Read Also: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!