Chorlapalli-Gorakhpur Amrit Bharat Express: తెలంగాణ ప్రయాణికులకు మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌ను రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్‌లో ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు మొదలవుతాయి. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే అమృత్ భారత్ రైళ్లలో ఇది ఆరోది. తెలంగాణ మీదుగా నడిచే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య కూడా ఏడుకు చేరనుంది.
చర్లపల్లి–గోరఖ్ పూర్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ కు 22075 నంబర్ కేటాయించారు. ఈ రైలు చర్లపల్లి నుంచి గోరఖ్ పూర్ కు అక్టోబర్ 2 నుంచి సాధారణ సర్వీసులు ప్రారంభించనుంది. తిరుగు ప్రయాణంలో 22076 నంబర్ రైలు అక్టోబర్ 4 నుంచి గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లికి బయలుదేరుతుంది. ఈ రైలు రెండు వైపులా వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ సర్వీస్ ఉపయోగపడనుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధానంగా ఎక్కువ దూరం ప్రయాణించే సామాన్య ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ రైలులో జనరల్, నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. రైలులో పుష్ పుల్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల రైలు వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కోచ్‌ల మధ్య సీల్డ్ గ్యాంగ్ వేలు, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి సీటు దగ్గర ఛార్జింగ్ పాయింట్లు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
చర్లపల్లి నుంచి బయలుదేరిన రైలు నాగ్‌పూర్ మీదుగా ఐదు రాష్ట్రాల గుండా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను ఈ రైలు కలుపుతుంది. ఈ మార్గంలో నాగ్‌పూర్ లాంటి ప్రధాన నగరాలతో పాటు పలు ముఖ్యమైన పట్టణాలకు కూడా కనెక్టివిటీ లభిస్తుంది.
చర్లపల్లి–గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పలు ప్రధాన స్టేషన్లలో హాల్ట్‌లు ఉంటాయి. చర్లపల్లి, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సీ, భోపాల్, బీనా స్టేషన్లలో ఆగుతుంది. ఆ తర్వాత విరంగనా లక్ష్మీబాయి ఝాన్సీ, ఒరై, కాన్పూర్ సెంట్రల్, పోఖ్రాయన్, గోమతీనగర్, బారాబంకి, గోండా మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.
చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్ వరకు ఈ రైలు సుమారు 32 గంటల 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించారు. 22075 నంబర్ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 9:45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం 6:25 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22076 నంబర్ రైలు ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి, సోమవారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
Read Also: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. స్టేషన్లలో నీళ్లు తాగారో అంతే సంగతులు!