AP roads development: వర్షాకాలం మొదలవగానే రహదారుల పరిస్థితి ఎంత కష్టంగా మారుతుందో అందరికీ తెలుసు. గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణం చేసే వారికి అదొక పరీక్షలాంటిది. వర్షం కురిసిందంటే బస్సులు, కార్లు, బైకులు ఒకదానితో ఒకటి పోటీగా జారిపడతాయి. కాస్త బ్యాలెన్స్ తప్పినా ప్రమాదం తప్పదు. గత కొన్నేళ్లలో రాష్ట్రంలో రహదారుల స్థితి మరీ దయనీయంగా మారిపోయింది. నగరాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్ల పరిస్థితి అధ్వాన్నస్థితిలో తయారయ్యాయని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో రోడ్లు ఎప్పుడైనా సరిగా ఉంటాయా? అనే ఆశ్చర్యపోయే స్థితిలోకి వెళ్లిపోయారు.
ఒకప్పుడు ఏపీ రహదారులు దేశంలోనే ఉత్తమంగా ఉండేవని. పక్కా రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డ్రైవర్ కళ్ల ముందు గుంతలు ఎక్కడనుండి వస్తాయో తెలియక గుండెల్లో ఆందోళనతో వాహనాన్ని నడిపే పరిస్థితి. అలాంటి దుస్థితి నుంచి బయటపడేందుకు ఒక్క నిర్ణయం చాలు అని చాలామంది భావించారు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఏపీ రోడ్లకు కొత్త కథ మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఎన్నో రోడ్లకు మహర్దశ పట్టింది. కానీ ఇప్పుడు తీసుకున్న ఒక్క నిర్ణయంతో.. ఇక రోడ్లు మరింత హైటెక్ లోకి మారనున్నాయి.
తాజాగా సచివాలయంలో జరిగిన సమీక్షలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్ల సమస్యపై చర్చించారు. రాష్ట్ర రహదారులు ఇకపై జాతీయ రహదారుల తరహాలో ఉండాలి. ఎక్కడా నాణ్యత లోటు ఉండకూడదు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే మార్గాలను ఎంచుకుని, వాటికి కొత్త ప్రాణం పోయాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ కొత్త ప్రణాళికలో రహదారుల నాణ్యతపై పర్యవేక్షణ, డిజిటల్ ట్రాకింగ్, మానిటరింగ్ వ్యవస్థ కూడా ఉండనుంది.
⦿ సీసీ కెమెరాలతో నిఘా
రాష్ట్రంలోని ప్రతీ 50 కిలోమీటర్ల రోడ్డుపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం ట్రాఫిక్ పర్యవేక్షణకే కాదు, రహదారి నాణ్యతను రియల్ టైమ్‌లో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడ గుంతలు వస్తున్నాయి, ఎక్కడ మరమ్మతులు అవసరమవుతున్నాయన్నది ఈ కెమెరాల ద్వారా వెంటనే కనిపిస్తుంది. ఏ కాంట్రాక్టర్ నిర్మాణం బలహీనంగా ఉంటే ఆ వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఈ సీసీ కెమెరాలు ఒక కీలక సాధనంగా పనిచేయనున్నాయి. డ్రైవర్‌లకు సురక్షిత ప్రయాణం కల్పించడం, రోడ్లపై జరిగే ఏవైనా అత్యవసర ఘటనలకు వెంటనే స్పందించడం కూడా వీటి ద్వారా సులభం అవుతుంది.
⦿ 12000 కిలోమీటర్లకు మహర్దశ
ప్రస్తుతం రాష్ట్రంలోని 12,000 కిలోమీటర్లకుపైగా ఉన్న హైవేల్లో పీపీపీ విధానంలో మార్పులు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న 1,300 కిలోమీటర్ల రోడ్లు మొదట ఫేజ్ వన్‌లోకి వస్తాయి. తరువాత 3,800 కిలోమీటర్లకుపైగా ఉన్న రహదారులు, చివరగా 5,000 కిలోమీటర్ల రోడ్లు రెండో దశలో మలుపు తిప్పుతాయి. అదనంగా యలమంచిలి – గాజువాక, గాజులమండ్యం – శ్రీసిటీ రహదారులు కూడా ఆధునిక రూపంలో తయారవుతాయి. ఇవన్నీ కేవలం సిమెంట్ తో కట్టిన మార్గాలే కావు. ఇప్పుడు ఈ రోడ్లు స్మార్ట్ టెక్నాలజీతో కలిపి ఒక కొత్త నెట్‌వర్క్‌లా మారబోతున్నాయి.
ఒకప్పుడు గుంతలు, మట్టి, ట్రాఫిక్ సమస్యలు ఏపీ ప్రజల దినచర్యగా ఉండేవి. కానీ ఇప్పుడు కథ మారబోతోంది. 2,000 కిలోమీటర్ల కొత్త రహదారులు రూ.1,000 కోట్లతో, పాడైన రోడ్ల మరమ్మతులకు రూ.500 కోట్లతో నూతన ప్రాజెక్టులు ప్రారంభమని సీఎం ప్రకటించారు. వర్షాకాలం ముగిసేలోపు అంచనాలు, టెండర్లు పూర్తి చేసి నవంబర్ నుంచే కొత్త పనులు మొదలవుతాయని ఆయన ఆదేశించారు.
మొత్తానికి, ఏపీ రోడ్లు ఇప్పుడు కేవలం ప్రయాణ మార్గాలు కాదు, హైటెక్ నెట్‌వర్క్‌గా మారుతున్నాయి. అడుగడుగునా నిఘా, డేటా ఆధారిత మానిటరింగ్, కాంట్రాక్టర్ల బాధ్యత అంతా ఒక్క దెబ్బకు ఆల్ సెట్ కానున్నాయి.