Lore Tripping| ఒక ఫేమస్ పర్యాటక ప్రదేశానికి వెళ్లడం కంటే, అక్కడి రహస్య కథ తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది యువ ప్రయాణికులు ఇలాంటి అనుభవాలకే ఆసక్తి చూపిస్తున్నారు. దెయ్యాల కథలు, శాపాలు, రహస్య సంఘటనలు, పురాతన గాథలు.. ఈ అంశాలే ప్రయాణికులను కొత్త ప్రాంతాల వైపు తీసుకెళ్తున్నాయి. ఈ కొత్త ట్రావెల్ ట్రెండ్ పేరు ‘లోర్-ట్రిప్పింగ్’. సాధారణ పర్యాటక ప్రదేశాల కంటే ఒక ఆసక్తికర కథ ఉన్న ప్రాంతాలకు వెళ్లడమే దీని ప్రత్యేకత. అంటే ఈ ప్రయాణాల్లో ప్రదేశం కంటే దాని వెనుక ఉన్న కథే ప్రధాన ఆకర్షణగా మారుతుంది.
భారత్‌లో ఇలాంటి కథలకు కొదవ లేదు. దేశంలోని కోటలు, గ్రామాలు, అడవులు, సరస్సులు, దేవాలయాల చరిత్రలో ఎన్నో జానపద కథలున్నాయి. చిన్న పట్టణాల్లో తరతరాలుగా చెప్పుకుంటున్న కథలు ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రత్యేకమైన ట్రావెల్ అనుభవాలను యువత కోరుకుంటోంది. ఇది కూడా ఈ ట్రెండ్‌కు కారణం.
రాజస్థాన్‌లోని భంగర్ కోట దేశంలోని ప్రసిద్ధ రహస్య ప్రదేశాల్లో ఒకటి. ఈ కోటకు సంబంధించిన ఒక శాపం కథ స్థానికంగా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తాంత్రికుడికి సంబంధించిన ఈ కథ వల్ల ఈ కోటను చూడడానికి పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అందువే భారత పురావస్తు శాఖ సూర్యాస్తమయం తర్వాత కోటలో సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేస్తుంది. ఈ నిబంధన కూడా కోటపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో కుల్ధార అనే పాత గ్రామం ఉంది. స్థానిక కథల ప్రకారం.. గ్రామస్థులు ఒక రాత్రిలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే రాత్రికి రాత్రి గ్రామం అంతా ఖాళీ అయిపోయింది. వారు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఎవరూ స్థిరపడకూడదని శాపం పెట్టారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆ గ్రామం చరిత్ర, జానపద కథలు, రహస్యాల గురించి తెలుసుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్ సరస్సుని సాధారణంగా ‘స్కెలిటన్ లేక్’ అని పిలుస్తారు. మంచు కరిగినప్పుడు సరస్సు పరిసరాల్లో పురాతన మానవ అవశేషాలు కనిపించాయి. ఈ అవశేషాల వెనుక కారణాలపై అనేక పరిశోధనలు, సిద్ధాంతాలు వెలువడ్డాయి. హిమాలయాల మధ్య ఉన్న ఈ ప్రాంతం రహస్యాలపై ఆసక్తి ఉన్న ప్రయాణికులను ఆకర్షిస్తోంది.
గుజరాత్‌లోని డుమాస్ బీచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ బీచ్‌లో లభించే నల్లటి ఇసుక చాలా ఫేమస్. గతంలో ఈ ప్రాంతంలో హిందువుల అంత్యక్రియలు చేసేవారని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత అక్కడ గుసగుసలు, నీడలు కనిపిస్తాయనే స్థానిక కథలు ఉన్నాయి. ఈ కథలు డుమాస్ బీచ్‌కు సాధారణ బీచ్‌లకు భిన్నమైన గుర్తింపు తీసుకొచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని బరోగ్ ప్రాంతానికి రైల్వే చరిత్రతో పాటు ఒక దెయ్యం కథ కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని డౌ హిల్ ప్రాంతానికి కూడా ఎన్నో రహస్య కథలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు సాధారణ పర్యాటక జాబితాల్లో ప్రముఖంగా లేకపోవచ్చు. అయితే వాటి కథలు తెలుసుకునేందుకు చాలామంది ప్రయాణికులు అక్కడికి వెళుతున్నారు.
Also Read: రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి
భారత్‌లోని స్థానిక కథలు పర్యాటక రంగానికి కొత్త అవకాశాలను అందించగలవు. ప్రయాణికులు ప్రసిద్ధ స్మారక చిహ్నాలతో పాటు స్థానిక జానపద కథలను కూడా అన్వేషించవచ్చు.
ఇలా చూస్తే, భవిష్యత్తులో భారత పర్యాటక రంగాన్ని కేవలం ప్రకృతి, చరిత్ర మాత్రమే కాదు అక్కడి ఆసక్తికరమైన కథలు కూడా కీలకం కానున్నాయి.