హిమాచల్ ప్రదేశ్ లో జోరుగా మంచు కురుస్తున్నది. భారీ హిమపాతం కారణంగా సోలాంగ్, రోహ్ తంగ్ లోని అటల్ టన్నెల్ మధ్య వందలాది వాహనాలు చిక్కుకుపోయాయి. పర్యాటకులు, వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. టన్నెల్ సమీపంలో ఏకంగా 1,000 వాహనాలు నిలిచిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. సుమారు 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలోనూ పెద్ద మొత్తంలో హిమపాతం కురువడంతో అక్కడి నుంచి వెళ్లేందుకు డ్రైవర్లకు పోలీసులు సిబ్బంది చేశారు. నిలిచిపోయిన వాహనాల్లో పెద్ద సరకు రవాణా ట్రక్కులు ఉండటంతో వాటిని అక్కడి నుంచి పంపించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్థానిక అధికారులు సైతం ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకునేందుకు తరలి వచ్చే పర్యాటకులతో మనాలిలో విపరీతంగా రద్దీ ఏర్పడింది.
డిసెంబర్ తొలివారం నుంచే హిమపాతం
ఈ నెల తొలివారం నుంచి మంచు కురవడం మొదలయ్యింది. మనాలిలోని పర్వతశ్రేణులు వెండి వర్ణంలో మెరిసిపోతూ కనిపించాయి. ఈ హిమపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కరోనా తర్వాత ఇక్కడి పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు. ఈ ఏడాది మళ్లీ పర్యాటలకు తాడికి పెరిగింది. మంచుతో కప్పబడిన కొండల అందాలను చూసి టూరిస్టులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సిమ్లాలో శీతాకాలపు శోభను చూసి సంతోషడుతున్నారు.
కరోనా తర్వాత పుంజుకున్న వ్యాపారాలు
కరోనా ముందు వరకు ప్రతి ఏటా శీతాకాలంలో హిమాచల్ ప్రదేశ్ కు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చే వారు. ఇక్కడి హోటల్స్, రెస్టారెట్లు, ఇరత వ్యాపార సముదాయాలు చక్కటి లాభాలను గడించేవి. కరోనా తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకరంగం పూర్తిగా డీలా పడింది. కానీ, మళ్లీ ఇప్పుడు గతంలో మాదిరిగా పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తున్నారు.
సంతోషంలో పర్యాటకులు
దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు హిమపాతంతో గడపుతూ ఆనందానికి లోనవుతున్నారు. చిన్నా, పెద్దా కలిసి ఇక్కడి మంచులో ఆడుతూ ఆనంద పరశం పొందుతున్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో, టీవీల్లో చూసిన మంచు కొండలను నేరుగా చూసి ఆశ్చర్యపోతున్నారు. “హిమాచల్ ప్రదేశ్ గురించి చిన్నప్పటి నుంచి వింటున్నారు. ఇక్కడి మంచు కొండలను సినిమాలు, టీవీల్లో మాత్రమే చూశాను. ఈ ఏడాది మా ఫ్యామిలీతో కలిసి హిమపాతాన్ని చూసేందుకు మనాలి వచ్చాం. ఇక్కడి మంచు వర్షం మమ్మల్ని మంత్ర ముగ్దులను చేసింది. నా జీవితంలో ఇలాంటి అద్భతమైన దృశ్యాలు చూడటం ఇదే తొలిసారి. ఈ అనుభూతిని ఎప్పటికీ మరచిపోలేం” అని ఓ టూరిస్టు వెల్లడించాడు.
పోలీసుల ప్రత్యేక చర్యలు
అటు హెవీ స్నో ఫాల్ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడ ట్రాఫిక్ పోలీసుల సమయంతో డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. రోడ్ల మీద సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల మీద ఏర్పడ్డ మంచును ఎప్పటికప్పుడు యంత్రాలతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: జస్ట్ 13 గంటల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం ఎప్పుడంటే!