ఖైరతాబాద్ (Khairatabad).. ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది.. ఎత్తైన వినాయకుడే. వినాయక చవితి వస్తుందంటే చాలు.. అందరి దృష్టి ఖైరతాబాద్ వినాయకుడి మీదే పడుతుంది. ఈ సారి ఎంత ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.. ఏ అవతారం.. ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. సుమారు 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఖైరతాబాద్ వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఈ వినాయకుడి వల్లే.. ఖైరతాబాద్‌కు కూడా పాపులర్ అయ్యింది. ‘ఖైరతాబాద్ వినాయకుడు’ అనేది ఎప్పటికి నిలిచిపోయే పిలుపు. వినాయక చవితి వేడుకలకు ఎంతో ప్రత్యేకమైన ఈ ప్రాంతానికి పేరు మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
ఖైరతాబాద్ పేరు మార్చాలనే.. ఉద్దేశం, అధికారిక ప్రతిపాదన గానీ ప్రభుత్వం చేయలేదు. అయితే, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. కొత్తగా ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల విశిష్టను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి ‘గణేష్‌పురి’గా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా తర్వాత దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడే అత్యంత ప్రసిద్ధి అని, నాటి పాత పేర్లను మార్చి, హిందూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై సీఎం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన ప్రతిపాదనపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ పేరుకు అర్థం ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది.
హైదరాబాద్‌లో ప్రముఖ వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాల్లో ఖైరతాబాద్ ఒకటి. ఈ ప్రాంతానికి దాదాపు 400 ఏళ్ల కుతుబ్ షాహీల నాటి సుదీర్ఘ చరిత్ర, ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ‘ఖైరతాబాద్’లోని ఖైరత్ అనేది ఒక పేరు. ఇది అరబిక్, పర్షియన్ పదాల కలయిక. ఖైరత్ అంటే దానం అని అర్థం. దీనికి పుణ్య కార్యం అనే అర్థం కూడా వస్తుంది. ఆబాద్ అనేది పర్షియన్ భాషలో నివాస స్థలం లేదా పట్టణం అని అర్థం. రెండు కలిపితే దానంగా ఇచ్చిన నివాస ప్రదేశం అని అర్థం వస్తుంది.
16వ శతాబ్దం చివర్లో , 17వ శతాబ్దం ఆరంభంలో.. గోల్కొండను పాలించిన ఐదవ సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ ప్రాంతాన్ని తన కూతురికి బహుమతిగా కేటాయించారు. అప్పట్లో ఆయన కుమార్తె ఖైరతున్నీసా బేగం తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకోవాలని ఎన్నో ప్రార్థనలు చేశారు. చికిత్సలు అందించారు. చివరికి ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో సుల్తాన్ తన కుమార్తెకు హైదరాబాద్‌లోని ఒక ప్రాంతాన్ని దానం ఇవ్వాలనుకున్నారు. ఆమె పేరులోని ‘ఖైరత్’కు ఆబాద్‌ను చేర్చి.. ఖైరత్ బాద్‌గా పిలవడం మొదలుపెట్టారు.
క్రీ.శ. 1626 ప్రాంతంలో ఖైరత్ ఆ ప్రాంతంలో కొత్త నివాసాన్ని, మసీదును, ఒక పెద్ద మెట్ల బావిని నిర్మించారు. ఆ తర్వాత తన ఆధ్యాత్మిక గురువూన అఖుంద్ ముల్లా అబుల్ మాలీకి సమర్పించారు. ఈ ప్రాంతాన్ని ఖైరత్.. తన గురువుకు దానంగా ఇచ్చింది కాబట్టి.. ఖైరతాబాద్ అని పేరు వచ్చి ఉంటుందని కూడా అంటారు. ఖైరతాబాద్ మసీదు కుతుబ్ షాహీల విశిష్టమైన ఇండో, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ శైలికి నిదర్శనం. గురువు ఆఖుంద్ ముల్లా అబుల్ మాలీ మక్కా యాత్రకు వెళ్లినప్పుడు ఆయన జ్ఞాపకార్థం మసీదు పక్కనే ఒక సమాధి నిర్మాణం చేపట్టారు. కానీ ఆయన యాత్రలోనే మరణించడంతో ఆ సమాధి నేటికీ ఖాళీగానే ఉంది.
Also Read: ఇండోనేషియా To జపాన్.. భారత్ కంటే ముందే ఇతర దేశాల్లో గణపతి పూజ జరిగిందా?
ఖైరతాబాద్.. ఇప్పుడు వినాయక వేడుకలకు కేంద్ర బిందువు. ఇక్కడి వినాయకుడిని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. నిమజ్జన వేడుకల్లో కూడా పాల్గొంటారు. 1954లో ఇక్కడ వినాయకుడి వేడుకలను ప్రారంభించారు. మొదట్లో వినాయక విగ్రహం ఎత్తు ఒక్క అడుగు ఎత్తు మాత్రమే. ఆ తర్వాత ఏడాదికి అడుగు చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఏటా ఖైరతాబాద్ వినాయకుడిని 25 లక్షల నుంచి 30 లక్షల మంది దర్శిస్తారు. వినాయక చవితి వేడుకల్లో రోజుకు సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా. ఏది ఏమైనా ఖైరతాబాద్ వినాయకుడు అనేది ప్రజల మదిలో నిలిచిపోయిన పేరు. ఆ పేరును మార్చాలనే ప్రతిపాదనను మీరు స్వాగతిస్తారా?
Also Read: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? సీటు కన్ఫర్మ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అభిప్రాయాలు, డిమాండ్లు కేవలం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల వ్యక్తిగతమైనవి. వీటితో ఈ BIG TVకి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో అందించిన చారిత్రక వివరాలు అందుబాటులో ఉన్న ప్రాంతీయ ఆధారాలు, చరిత్ర పత్రాల నుంచి సేకరించబడినవి. పక్షపాతం లేని నిష్పాక్షిక విలువల కట్టుబాటుతో పాటు, అన్ని వర్గాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక భావోద్వేగాలను మేము గౌరవిస్తాము.
Disclaimer: The opinions and demands mentioned in this article are those of political leaders and public figures, and do not reflect the official views of this publication. Historical information presented is sourced from established regional archives and heritage records. We remain committed to neutral, unbiased reporting and respect the cultural and historical diversity of all communities.