Indian Railways: గత రెండు రోజులుగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో జమ్మూకాశ్మీర్ అతలాకుతలం అవుతోంది. నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండగా, పలు చోట్ల కొండ చరియలు విరిగిపడి రహదారులు ధ్వంసం అయ్యాయి. పలు చోట్ల, రైల్వే ట్రాక్ లు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ డివిజన్ లో మొత్తం 22 రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ రైళ్ల రద్దు వెంటనే అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ రైలు సర్వీసులు జమ్మూ, కట్రా రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరవలసి ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ భారీ వర్షాల కారణంగా మంగళవారం నాడు కూడా 27 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ వెళ్లే రైలు సర్వీసులు రద్దు
అటు పటాన్ కోట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని కండ్రోరీ వెళ్లే రైల్ సర్వీసులను సైతం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిరోజ్ పూర్, మండా, పటాన్ కోట్ కు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. కత్రా – శ్రీనగర్ మధ్య నడిచే రైల్వే సర్వీసులు కొనసాగుతున్నాయని జమ్మూ డివిజనల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
సోమవారం నుంచి భారీ వర్షాలు, 30 మంది మృతి
ఇక జమ్మూకాశ్మీర్ లో సోమవారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఎడతెరపిలేని కుండపోత వానలు పడుతున్నాయి. ఈ దశాబ్దంలోనే అత్యధిక వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల కారణంగా తాజాగా 30 మంది యాత్రికులు చనిపోయారు. వైష్ణోదేవి దర్శనానికి వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడటంతో వీళ్లు మృతి చెందారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం ఆర్మీ, NDRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అటు కత్రా రహదారిపై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. రహదారులు ధ్వంసం అయ్యాయి. పలు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.
Read Also: రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం బంద్.. అసలు విషయం చెప్పిన కేంద్రం!
ముంపు ప్రాంత ప్రజల తరలింపు
అటు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారిందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలు తగ్గే వరకు వారిని అక్కడే ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: అత్యధిక సెల్ఫీ మరణాలు ఈ దేశాల్లోనే.. వామ్మో ఇండియా ఆస్థానంలో ఉందా?