Indian Railways Special Trains: దీపావళి, ఛత్ పూజ సందర్భంగా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమైన పండుగలు కావడంతో దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు పెద్ద ఎత్తున రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ రెండు పండుగల సందర్భంగా 12,000 ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోంది. పండుగల సమయంలో ప్రయాణీకుల రద్దీని సులభతరం చేయడానికి ఈ నిర్ణం తీసుకున్నట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా సేవలు అందించనున్నాయి. సాధారణ రైళ్లలో టికెట్లు పొందలేని వారికి ఈ ప్రత్యేక రైళ్లలో అదనపు బెర్తులు లభించనున్నాయి.
తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్, కేంద్ర మంత్రి లల్లన్ సింగ్, ఎంపీ సంజయ్ కుమార్ ఝాతో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ-గయ, సహర్సా- అమృత్ సర్, చాప్రా-ఢిల్లీ, ముజఫర్ పూర్- హైదరాబాద్ ను కలుపుతూ నాలుగు అమృత్ భారత్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అదనంగా, పూర్నియా-పాట్నా మార్గంలో కొత్త వందే భారత్ సర్వీస్ ను తీసుకురానున్నట్లు తెలిపారు.
దీపాళి తిరుగు ప్రయాణంలో సౌలభ్యం కోసం
దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు రద్దీ పెరిగే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత దీపావళి, ఛత్ పూజ కోసం 12,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా, పండుగల తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో రైలు సర్వీసులు బంద్!
పండుగల సందర్భంగా ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’
భారతీయ రైల్వే ఇటీవల ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పండుగ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, మరింత సరసమైనదిగా మార్చడానికి ఉపయోగపడనున్నట్లు తెలిపింది. ప్రయాణీకులు అప్ అండ్ డౌన్ ప్రయాణీకులు రెండింటినీ కలిసి టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఈ పథకం తిరుగు ప్రయాణ ఛార్జీలపై డిస్కౌంట్లను ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణీకులు ఈ పథకం కింద టికెట్లపై డిస్కౌంట్లను పొందుతున్నారు. రైల్వే అధికారులు సైతం ఈ పథకం ప్రయాణీకులకు తెలిసేలా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ పథాకాన్ని ఉపయోగించుకుని టికెట్లపై చక్కటి తగ్గింపును పొందాలని సూచిస్తోంది. మొత్తంగా దేశంలో ముఖ్యమైన పండుగలైన దీపావళి, చత్ పూజ సందర్భంగా 12 వేల ప్రత్యేక రైళ్లను నడపడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!