Secunderabad Railway Station: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కీలక రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లించబడిన, టెర్మినల్ మార్పులు చేయబడిన అనేక రైళ్లు సెప్టెంబర్ నుంచి మళ్లీ యథా స్థానాల నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రయాణీకుల ప్రయాణ అనుభవం మరింత సులభతరం కానున్నట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించే రైళ్లు ఇవే!
⦿ కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ-కాచిగూడ-విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ (రైలు నం. 12713/12714) మళ్ళీ సికింద్రాబాద్ నుంచి నడవనుంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
⦿ సెప్టెంబర్ 8 నుంచి చర్లపల్లి-మౌలా అలీ-సికింద్రాబాద్ మీదుగా తిరిగి వెళ్ళే రైళ్లలో కాజీపేట-హడప్సర్-కాజీపేట ట్రై-వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17014/17013) సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించనుంది.
⦿ సెప్టెంబర్ 7 నుంచి విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 12805/12806) సికింద్రాబాద్ నుంచి నడవనుంది.
⦿ సెప్టెంబర్ 12 నుంచి వాస్కో డ గామా-జాసిదిహ్-వాస్కో డ గామా వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17321/17322) సికింద్రాబాద్ నుంచి నడుస్తుంది.
⦿ సెప్టెంబర్ 9 నుంచి మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17208/17207) సికింద్రాబాద్ నుంచి ఆపరేషన్స్ కొనసగించనుంది.
⦿ సెప్టెంబర్ 8 నుంచి కాకినాడ పోర్ట్-సాయినగర్ షిర్డీ-కాకినాడ పోర్ట్ ట్రై-వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17206/17205) సికింద్రాబాద్ నుంచి నడుస్తుంది.
⦿ సెప్టెంబర్ 7 నుంచి ముంబై-విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 18519/18520) సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంది.
Read Also: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!
కొనసాగుతున్న రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునీకరిస్తున్నారు. ఈ పనుల కారణంగా 60–120 రైళ్లను ఇతర టెర్మినల్స్ కు మార్చారు. రెండు అంతస్తుల స్కై కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారమ్ విస్తరణ, కొత్త భవనాల నిర్మాణం వంటి పనుల కోసం సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌లను మూసివేశారు. పది ప్లాట్‌ఫామ్‌లలో ఎనిమిది ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. భారీ స్థాయిలో పునర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో సికింద్రాబాద్ కు వెళ్లాల్సిన చాలా రైళ్లను దారి మళ్లించారు. పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మల్కాజ్ గిరి లాంటి సమీప స్టేషన్‌లకు డైవర్ట్ చేశారు. మరికొన్ని రైళ్లను హైదరాబాద్, ఉమ్దానగర్ కు డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆ రైళ్లు మళ్లీ సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి.
Read Also: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి పంబన్ బ్రిడ్జి పరిస్థితి ఇది, రైలు సేవలన్నీ బంద్!