Pamban Rail Bridge Vertical Lift: పంబన్ రైల్వే వంతెన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ పంబన్ వంతెన.. భారత ప్రధాన భూభాగంతో రామేశ్వరం దీప్వాన్ని కలుపుతుంది. ఆసియాలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ వంతెనను రైల్వేశాఖ నిర్మించింది. పాత పంబన్ బ్రిడ్జి స్థానంలో ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ రూ.535 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించింది. ప్రతిష్టాత్మకమైన ఈ రైల్వే వంతెనలోని వర్టికల్ లిఫ్ట్ లో తాజాగా సమస్య ఏర్పడింది. ఈ లిఫ్ట్ స్పాన్ మధ్యలో నిలిచిపోయింది. ఈ కారణంగా ఆ మార్గంలో రాకపోకలు కొనసాగించే పలు రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. రైల్వే టెక్నికల్ టీమ్ గంటల తరబడి మరమ్మతులు చేపట్టి లిఫ్ట్ సమస్యను సాల్వ్ చేశారు.
పంబన్ రైల్వే వంతెనపై పలు రైళ్ల రాకపోకలకు బ్రేక్
పంబన్ రైలు వంతెనలోని వర్టికల్ లిఫ్ట్ స్పాన్ మధ్యలో నిలిచిపోవడంతో రామేశ్వరం నుంచి బయలుదేరిన రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లతో సహా నాలుగు రైళ్లను గంటల తరబడి నిలిపివేశారు. నిలిచిపోయిన రైళ్లలో రైలు నం. 16104 రామేశ్వరం – తాంబరం ఎక్స్ ప్రెస్, రైలు నం. 16527 రామేశ్వరం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్, రైలు నం. 56716 రామేశ్వరం – మధురై ప్యాసింజర్, రైలు నం. 56713 మధురై – రామేశ్వరం ప్యాసింజర్లను సాయంత్రం నుంచి వంతెనకు ఇరువైపులా నిలిపివేశారు. రామేశ్వరం నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన తాంబరం వెళ్ళే రైలును పంబన్ రైల్వే వంతెన ముందు అధికారులు వంతెన నిలువు స్పాన్ ను ట్రాక్ స్థాయికి రాకపోవడంతో నిలిపివేశారు. సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరాల్సిన రామేశ్వరం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ రాత్రి 8.20 గంటలకు బయలుదేరింది. రామేశ్వరం- మండపం మధ్య ప్యాసింజర్ రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. వాటి సేవలను తిరిగి ప్రారంభించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది.
Read Also: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!
సాయంత్రం 7 గంటల సమయంలో సమస్య పరిష్కారం
రైల్వే ఇంజినీర్లు, టెక్నికల్ సిబ్బంది చాలా గంటల పాటు ప్రయత్నించి లిఫ్ట్ లోని సమస్యలను సాల్వ్ చేశారు. ఆ తర్వాత 654 టన్నుల లిఫ్ట్ స్పాన్ ను ట్రాక్ పై ఉంచి, వంతెనపై తేలికపాటి ఇంజిన్‌ను నడిపారు. సాయంత్రం 7 గంటలకు ట్రయల్ విజయవంతం అయిన తర్వాత, రైల్వే సేవలు తిరిగి ప్రారంభించబడ్డాయి. ఫలితంగా, తాంబరం వెళ్ళే రైలు దాదాపు నాలుగు గంటలు ఆలస్యం అయింది. మళ్లీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!