Women on Train Engine: చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్ లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ మహిళ ఏకంగా రైలు ఇంజిన్ పైకి ఎక్కడంతో అందరూ షాకయ్యారు. ప్రయాణీకులు వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పడంతో అలర్ట్ అయ్యారు. రైల్వే పోలీసుల సహకారంతో సదరు మహిళను సేఫ్ గా కిందికి దించారు. ఒకవేళ ఆ మహిళ పైన ఉన్న విద్యుత్ వైర్లను ముట్టుకుంటే బూడిదయ్యేది. కానీ, లేచిన సమయంలో బాగుండి బయటపడింది.
రైలు ఇంజిన్ ఎక్కిన గుర్తు తెలియని మహిళ
రైలు వచ్చి స్టేషన్ లో ఆగిన వెంటనే ఓ మహిళ నేరుగా రైలు ఇంజిన్ మీదికి ఎక్కింది. పైకి ఎక్కి అటు ఇటూ చూస్తూ ఉంది. అంతేకాదు, ఇంజిన్ మీద ఉన్న కరెంటు తీగలను పట్టుకునే ప్రయత్నం చేసింది. ప్లాట్ ఫారమ్ మీద ఉన్న ప్రయాణీకులు గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు ప్రభుత్వ రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్ కూడా స్పాట్ కు చేరుకుంది. వెంటనే, అధికారులకు సమాచారం అందించింది కరెంటు సరఫరాను నిలిపివేయించారు. ఆ తర్వాత ఇంజిన్ పైకి ఎక్కి సదరు మహిళకు ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఆ తర్వాత ఆమెను ఓ ఆశ్రమానికి తరలించారు. ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియదని రైల్వే అధికారులు తెలిపారు. ఆమె మతి స్థిమితం బాగాలేని కారణంగానే రైలు ఇంజిన్ పైకి ఎక్కినట్లు గుర్తించారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనతో కాసేపు రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
కొద్ది రోజుల క్రితం పట్టాల మీద కారు నడిపిన యువతి
గత నెలలో తెలంగాణలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. కొండకల్ రైల్వే గేట్- శంకర్‌పల్లి మధ్య రైల్వే పట్టాల మీదికి ఓ యువతి తన కారును ఎక్కించింది. ఈ నేపథ్యంలో పలు రైల్వే సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సదరు యువతి శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వైపు నేరుగా పట్టాలపై కారు నడుపుతున్నట్లు గుర్తించారు. రైల్వే సిబ్బంది ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, అత్యంత వేగంతో ముందుకు వెళ్లిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఎదురుగా వస్తున్న రైలును ఆపారు. ఈ ఘటనతో ఇతర రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లలోని ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. సగటున, పలు రైళ్లు 45 నిమిషాల పాటు ఆలస్యం అయ్యాయి.
సుమారు గంట పాటు ఇబ్బందులు
సదరు యువతి వాహనాన్ని ఆపి పట్టాల పై నుంచి కారును క్లియర్ చేయడానికి దాదాపు గంట సమయం పట్టింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి రైల్వే అధికారులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఆమెపై పలు రైల్వే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read Also: ఆ నగరాలకూ బుల్లెట్ రైళ్లు.. జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయా? ప్రాజెక్ట్ డిటైల్స్ ఇవే!