Indian Railway Trains Cancelled: వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 100 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. ముంబైలో ఎడతెరిపిలేని వానలతో నీరు నిలిచిపోవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)- థానే మధ్య అన్ని మెయిన్ లైన్ రైలు సర్వీసులను క్యాన్సిల్ చేశారు. కుర్లా-సియోన్ మధ్య ప్రధాన లైన్ లో ఫాస్ట్ రైళ్లను నిలిపివేశారు. హార్బర్ లైన్ లో, చునాభట్టి స్టేషన్ లో వరదలు కారణంగా CSMT- చునాభట్టి మధ్య రైళ్ల రాకపోకలను ఉదయం 11.20 గంటల నుంచి నిలిపివేశారు.
అటు ఆగస్టు 19- 21 మధ్య రాకపోకలు కొనసాగించాల్సిన 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అటు ఆగస్టు 19-20 తేదీల్లో ప్రయాణాలు ప్రారంభించాల్సిన 13 రైళ్లు రద్దు చేసింది. ఆగస్టు 21న వెళ్లాల్సిన రైలును కూడా క్యాన్సిల్ చేసింది. పూణే, పన్వేల్, నాసిక్ రోడ్, ఇగత్పురితో సహా స్టేషన్లలో ఏడు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే ప్రయాణీకులకు సహాయం చేయడానికి సెంట్రల్ రైల్వే CSMT, థానే, కళ్యాణ్, పన్వేల్, వడాలా, కుర్లా, వాషి, దాదర్ లాంటి ప్రముఖ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసింది. CSMT నుంచి బయలుదేరాల్సిన ఐదు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ధూలేకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు, హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 2.15 గంటల వరకు, చెన్నైకు వెళ్లే ఎక్స్ ప్రెస్‌ను మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.45 గంటల వరకు, నాందేడ్ ఎక్స్ ప్రెస్‌ను మధ్యాహ్నం 1.10 గంటల నుంచి 2.30 గంటల వరకు, జబల్ పూర్‌కు వెళ్లే ఎక్స్ ప్రెస్‌ను మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు టైమింగ్స్ మార్చారు.
CSMT- థానే మధ్య అన్ని ప్రధాన లైన్ సేవలను నెక్ట్స్ నోటీసు వచ్చే వరకు నిలిపివేయబడతాయని సెంట్రల్ రైల్వే వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం థానే, కర్జాత్, ఖోపోలి, కసారా మధ్య షటిల్ రైళ్లు నడుస్తున్నాయి. హార్బర్ లైన్ లో, కుర్లా జంక్షన్ (CLA)- CSMT మధ్య రైళ్లు నిలిపివేయబడ్డాయి.”ముంబైలో భారీ వర్షం కొనసాగుతోంది. హార్బర్ లైన్ లో పన్వెల్, వాషి, ట్రాన్స్ హార్బర్ లో థానే, వాషి, మెయిన్ లైన్ లో థానే, కళ్యాణ్, కసారా, కర్జాత్ మధ్య మాత్రమే స్థానిక రైలు సర్వీసులు నడుస్తున్నాయి. పలు రూట్లలో రైల్వే ట్రాక్స్ మీద నీళ్లు నిలిచాయి. ఆఫీసులు, సూళ్లు, కాలేజీలు మూసివేయడంతో రష్ తక్కువగా ఉంది” అని సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పి డి పాటిల్ తెలిపారు.
వెస్ట్రన్ రైల్వే పరిధిలో భారీ వర్షాల కారణంగా 180 మందికి పైగా సిబ్బంది, 70 మంది పంప్ ఆపరేటర్లను నియమించారు. ఈ బృందం 110 డీవాటరింగ్ పంపులను నిర్వహించింది. గ్రాంట్ రోడ్, దాదర్, వాసాయి రోడ్, విరార్, బాంద్రా, అంధేరి, బోరివలితో సహా స్టేషన్లు, వంతెనల దగ్గర నీళ్లు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. “మూడు రోజులుగా నిరంతర భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, పది నుండి పదిహేను నిమిషాలు మాత్రమే ఆలస్యంగా రైళ్లు సజావుగా నడుస్తున్నాయి. వరద సమస్యలు రాకుండా చూసేందుకు 180 మందికి పైగా సిబ్బందిని నియమించాం” అని పశ్చిమ రైల్వే CPRO వినీత్ అభిషేక్ వెల్లడించారు.
Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో రైలు సర్వీసులు బంద్!