Travel In Train Without Ticket: ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ‘మిలీనియం గిఫ్ట్’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ఉచిత నెలవారీ సీజన్ టికెట్లు అందించనుంది. ఈ పాస్ లను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టూడెంట్స్ తమ నివాస స్థలం, స్కూల్ మధ్య ప్రయాణించడానికి ఈ పాస్ లను అందించనుంది. విద్యార్థులకు రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా ఎడ్యుకేషన్ కు సపోర్టు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
‘మిలీనియం గిఫ్ట్’ స్కీమ్ కు అర్హులు ఎవరంటే?
10వ తరగతి వరకు బాలురకు ఈ పథకం ద్వారా ఉచిత పాస్ అందిస్తారు. ఇక బాలికల విషయానికి వస్తే, 12వ తరగతి వరకు చదివే వాళ్లకు అందిస్తారు. ఇది వారి నివాసం, పాఠశాలకు మధ్య ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.
ఉచిత టికెట్ గురించి..
ఈ పథకం కింద నెలవారీ సీజన్ టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి. త్రైమాసిక సీజన్ టికెట్లు అందించబడవు. ఈ పాస్ కేవలం సెకెండ్ క్లాస్ లో ప్రయాణించడానికే ఉపయోగపడుతుంది. గరిష్ట దూరం 150 కి.మీ వరకు కవర్ చేస్తుంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లతో సహా మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఈ పాస్ తో ప్రయాణించడం కుదరదు. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో CIDCO సర్ ఛార్జ్ లాంటి అదనపు ఛార్జ్‌లు విధించబడవు. విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల నుంచి బోన ఫైడ్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఈ పథకం విద్యార్థులకు రాయితీ MSTల మాదిరిగానే షరతులకు లోబడి ఉంటుంది. ఈ టికెట్లపై రైల్వేస్ నుంచి మిలీనియం గిఫ్ట్ అనే స్కీమ్ అనే సీల్ వేసి ఉంటుంది.
ఈ పాస్ లు ఎందుకు ప్రవేశ పెట్టారంటే?
ఈ పాస్ లు ముఖ్యంగా గ్రామీణ, శివారు ప్రాంతాలలోని విద్యార్థులకు సరసమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అదే సమయంలో విద్యను ప్రోత్సహించడానికి సాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పథకం భారతీయ రైల్వే విద్యార్థులకు రాయితీలను అందించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగం. ఇందులో జనరల్, SC/ST కేటగిరీ విద్యార్థులకు స్వస్థల ప్రయాణం, విద్యా పర్యటనలు, ప్రవేశ పరీక్షలకు రాయితీ ఛార్జీలు కూడా ఉన్నాయి. జనరల్ కేటగిరీ విద్యార్థులు స్వస్థలం, విద్యా పర్యటనలకు 2వ, స్లీపర్ క్లాస్ లో 50% రాయితీతో వెళ్లే అవకాశం ఉంటుంది. SC/ST కేటగిరీ విద్యార్థులకు 75% రాయితీ లభిస్తుంది.
ఈ పాస్ పొందాలంటే ఎలా?
విద్యార్థులు సమీపంలోని రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవాలి. చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్, చదువుతున్న స్కూల్, కాలేజీ నుంచి బోనాఫైడ్ సర్టిఫికేట్ అందించాలి. ఆ తర్వాత MST అనేది ప్రయాణీకుల పేరు, వయస్సు, స్టేషన్లు, తరగతి, చెల్లుబాటు అయ్యే వివరాలను కలిగి ఉన్న ప్లాస్టిక్-కోటెడ్ కార్డ్ గా జారీ చేయబడుతుంది. ప్రయాణ సమయంలో చెకింగ్ అధికారులకు ఈ పాస్ ను చూపించాల్సి ఉంటుంది.
Read Also: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?