Indian Railways: దేశంలో నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు. రోజూ 13 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. రోజూ సుమారు 2.5 కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి తెలసుకుందాం. ఈ రైలు దాని ప్రయాణాన్ని పూర్తి చేయడానికి నాలుగు రోజులు పడుతుంది. ఈ రైలు తొమ్మిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణం దేశంలోని వైవిధ్యభరితమైన ప్రకృతి అందాలను అందిస్తుంది. అస్సాంలోని పచ్చని తేయాకు తోటలతో ప్రారంభమై. కన్యాకుమారిలోని ప్రశాతంమైన ఇసుక తీరాలలో ముగుస్తుంది. ఈ రైలు ఎన్నో రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తుంది. ఇంతకీ ఆ రైలు ఏది? ఎన్ని కిలో మీటర్లు ప్రయాణిస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలో అత్యంత పొడవైన రైలు ప్రయాణం
అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు కొనసాగే ప్రయాణం దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పొడవైన మార్గంలో వివేక్ ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులను తీసుకెళ్తుంది. ఈ దాదాపు 4,200 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దూరం పరంగా, సమయం పరంగా ఇదే అత్యంత పొడవైన రైలు మార్గం. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఈ రైలు 2013లో ప్రారంభించబడింది. తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 75 గంటలు పడుతుంది. మార్గం మధ్యంలో ఈ రైలు 59 కంటే ఎక్కువ స్టేషన్లలో ఆగుతుంది. దాని గమ్యస్థానాన్ని చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది.
వారానికి రెండుసార్లు ప్రయాణం
వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు వారానికి రెండుసార్లు నడుస్తుంది. మంగళవారాలు, శనివారాల్లో రాకపోకలను కొనసాగిస్తుంది. ఇది దిబ్రూఘర్ నుంచి సాయంత్రం 7:35 గంటలకు బయలుదేరి కన్యాకుమారి చేరుకోవడానికి 74 గంటల 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. నాల్గవ రోజు రాత్రి 9:55 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైల్లో AC 2 ఛార్జీ రూ.4,450, AC 3 ఛార్జీ రూ.3,015, స్లీపర్ క్లాస్ ఛార్జీ రూ.1,185గా ఉంటుంది. డైనమిక్ ఛార్జీల విధానం కారణంగా డిమాండ్ ను బట్టి ఛార్జీలు మారే అవకాశం ఉంటుంది.
Read Also: ఖతార్ రోడ్లు బ్లాక్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా?
ఏ రాష్ట్రాలను కవర్ చేస్తుందంటే?
దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు అయిన వివేక్ ఎక్స్‌ప్రెస్, దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు తొమ్మిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ మీదుగా ఈ రైలు తమిళనాడుకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణం ఇంచుమించు ఢిల్లీ నుంచి సింగపూర్ కు విమానంలో ప్రయాణించే దూరానికిసమానం. ఢిల్లీ- సింగపూర్ మధ్య దూరం దాదాపు 4,155 కి.మీ(2,582 మైళ్ళు).
Read Also: ఇండియా నుంచి అమెరికా ప్రయాణం, జస్ట్ 18 నిమిషాల్లోనే, మస్క్ ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!