జపాన్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు జపాన్ విమానయాన సంస్థ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే, అంతర్జాతీయ సందర్శకులు దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా ఉచిత దేశీయ విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టోక్యో లాంటి ప్రసిద్ధ ప్రదేశాలకు సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఉచిత దేశీయ విమానాలను అందించడం ద్వారా ప్రయాణికులను ఇతర పర్యాటక ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నం చేస్తోంది.
ఉచిత ప్రయాణం ఎవరు చెయ్యొచ్చంటే?
2024 నుంచి జపాన్ ఎయిర్ లైన్స్ ఈ సేవను అందిస్తోంది. 64 దేశీయ విమానాశ్రయాలలో ఎక్కడి నుంచి అయినా, ఈ ఉచిత విమాన సర్వీసులను పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కు నిర్దిష్ట ముగింపు తేదీ అనేది లేదు. ఇది ప్రధాన పర్యాటక కేంద్రాలతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వెళ్లేలా చొరవ తీసుకుంటుంది. ఇతర దేశాల నుంచి జపాన్ ఎయిర్ లైన్స్ లో జపాన్ కు వచ్చిన వాళ్లు దేశంలో ఉచిత విమాన సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, చైనా నుంచి విమానంలో ప్రయాణించే సందర్శకులు టోక్యోకు చేరుకుని అక్కడ, 24 గంటలకు పైగా ఉండాలనుకుంటే అదనంగా 100 డాలర్లు( సుమారు రూ.8 వేలు) చెల్లించాల్సి ఉంటుంది. థాయిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియా, తైవాన్ నుంచి వచ్చే వారికి ఎలాంటి అదనపు ఫీజు ఉండదు.
ఎవరికి లాభం కలుగుతుంది?
అంతర్జాతీయ టికెట్ ధరలు జపాన్ ఎయిర్ లైన్స్ ఇచ్చే ఆఫర్ ద్వారా చాలా తక్కువకే లభిస్తాయి. ఉచిత దేశీయ ప్రయాణం ద్వారా టోక్యో సందర్శన, హక్కైడోలో స్కీయింగ్ ట్రిప్, క్యోటో, హిరోషిమా లాంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఉచితంగా విమానంలో వెళ్లి ఈ ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుంది.
ఎందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చారు?
దేశీయంగా ఉచిత విమానాలు అందుబాటులోకి తీసుకురావడం వెనుక ప్రభుత్వం కీలక ఆలోచన ఉంది.
⦿ పర్యాటకులు ఎక్కువగా ఉండే నగరాల్లో రద్దీని తగ్గించడం.
⦿ గ్రామీణ, ప్రాంతీయ ప్రాంతాలకు పర్యాటక ఆదాయాన్ని విస్తరించడం.
⦿ జపాన్ సాంస్కృతిక సందర్శనా స్థలాలను ప్రోత్సహించడం.
Read Also: అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ.1499కే ఫ్లైట్ టికెట్!
జపాన్ తీసుకొచ్చిన ఉచిత విమాన కార్యక్రమాన్ని రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలతో ఇబ్బంది పడుతున్న ఇతర దేశాలకు స్పూర్తిని ఇస్తుంది. సందర్శకుల ఆసక్తిని తక్కువ అన్వేషించబడిన ప్రాంతాలకు మార్చడం ద్వారా, దేశాలు తమ అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలను రక్షించుకోవడంతో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.కరోనా తర్వాత పర్యాటక రంగాన్ని మళ్లీ గాఢిలో పెట్టడంతో పాటు కొత్త ప్రాంతాలను పర్యాటకులు అణ్వేషించేలా జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత విమాన కార్యక్రమం ద్వారా దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రాణాళికలు సిద్ధం చేస్తోంది.