Kerala Railway Stations Shutdown: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఇండియన్ రైల్వే ఒకటి. రోజూ కోట్లాది మంది రైల్వే ద్వారా తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. తక్కువ టికెట్ ధరలు, ఆహ్లాదకర ప్రయాణం కారణంగా చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. సుదూర ప్రయాణాలు చేసే వాళ్లు ట్రైన్ జర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే, కొన్ని కారణాలతో దేశ వ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లను మూసి వేస్తోంది ఇండియన్ రైల్వే. అందులో భాగంగానే తాజాగా కేరళలో 2 రైల్వే స్టేషన్లను క్లోజ్ చేయాలని నిర్ణయించింది.
కేరళలో మూతపడే రైల్వే స్టేషన్లు ఇవే!
కేరళలో రెండు రైల్వే స్టేషన్లను శాశ్వతంగా మూసివేయాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రైల్వే స్టేషన్లు ఉత్తర జిల్లాల్లో ఉన్నాయి. కన్నూర్ జిల్లాలోని చిరక్కల్, కోజికోడ్ జిల్లాలోని వెల్లరక్కడ్ స్టేషన్లను షట్ డౌన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఇక్కడ ఏ ప్యాసింజర్ రైళ్లు ఆగవని తెలిపింది. ప్రస్తుతం, ఈ స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. ఇకపై అవి కూడా ఆగవు. ఈ రైల్వే స్టేషన్ల ఉద్యోగులను ఇతర రైల్వే స్టేషన్లలో విధులు అప్పగించనున్నారు. చిరక్కల్ రైల్వే స్టేషన్ లో పని చేసే ఉద్యోగులను దగ్గరలోని కన్నూర్ రైల్వే స్టేషన్ కు తరలించనున్నారు. ఇక వెల్లరక్కడ్ రైల్వే స్టేషన్ లో పని చేసే ఉద్యోగులను దగ్గర లోని కోయిలాండి, తిక్కోడి స్టేషన్లకు తరలించనున్నారు. ఈ స్టేషన్లపై ఆధారపడిన ప్రయాణీకులు ఇకపై ఇతర స్టేషన్లపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ రైల్వే స్టేషన్లను మూసివేశారంటే?
రైల్వేలో ఏ పని చేయాలన్నా, చేయకూడదన్నా తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్లు క్లోజ్ చేయడానికి కూడా కొన్ని నిబంధనలు పాటిస్తారు. ఒక స్టేషన్ లాభదాయకం కాదని భావించడం, లేదంటే ప్రయాణీకుల అవసరాలను తీర్చకపోతే వాటిని మూసివేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక స్టేషన్ లో బ్రాంచ్ లైన్లలో రోజుకు 25 కంటే తక్కువ మంది ప్రయాణీకులు ఉండటం, మెయిన్ లైన్లలో 50 మంది ప్రయాణీకులు ఉంటే మూసివేసే అవకాశం ఉంటుంది. అయితే, తాజాగా కేరళలో క్లోజ్ చేసే రైల్వే స్టేషన్లకు కూడా అనుకున్న స్థాయిలో ప్రయాణీకుల రద్దీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్, ఇక ఆ ప్రాంతాలకూ మెట్రో వచ్చేస్తోంది!
ఇటీవలి సంవత్సరాల్లో క్లోజ్ చేసిన రైల్వే స్టేషన్లు
గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో పలు రైల్వే స్టేషన్లను క్లోజ్ చేస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. వాటిలో ఒకటి బెంగాల్ లోని కల్యాణ్ పూర్ రైల్వే స్టేషన్ కాగా, మరొకటి యూపీలోని రావత్ పూర్ రైల్వే స్టేషన్. ఏపీలో 2020-21లో ఏకంగా ఏడు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ మూసి వేసింది. తక్కువ ప్రజాదరణ, లాభదాయక కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని సేలం-కరూర్ లైన్ లో ఉన్న వంగల్ స్టేషన్ ను కూడా మూసివేసింది. లాభదాయం కాని మరికొన్ని స్టేషన్లను కూడా రైల్వే అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. వాటిని కూడా త్వరలో మూసివేయనున్నట్లు సమాచారం.
Read Also: సమ్మర్ స్పెషల్ సర్వీసులు పొడిగింపు, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!