Ketan Agarwal Murder Case Sparks Dark Tourism: మహారాష్ట్రలోని ప్రసిద్ధ లోహగడ్ కోట గత కొంతకాలంగా బాగా ఫేమ్ అవుతోంది. పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు తర్వాత ఈ చారిత్రక కోట దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్ మర్డర్ జరిగిన జరిగిన ప్రదేశాన్ని చూడాలనే ఆసక్తితో పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పూణేకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహగడ్ కోట చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తో అనుబంధం ఉన్న ఈ కోట సాధారణంగా ట్రెక్కింగ్, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాధాన్యత కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే, ఇటీవల జరిగిన హత్య కేసు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. సెలవు రోజుల్లో ఇంతకు ముందు వెయ్యి మంది వరకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఇప్పుడు 1,500 వరకు చేరుతోంది. సాధారణ రోజుల్లో కూడా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో డార్క్ టూరిజం అంశం మరోసారి చర్చకు వచ్చింది. హత్యలు, ప్రమాదాలు, యుద్ధాలు, విషాద సంఘటనలు జరిగిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజలు వెళ్లడాన్ని డార్క్ టూరిజం అంటారు. కొందరు చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తే, మరికొందరు కేవలం ఆసక్తి కారణంగా అలాంటి ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
జూన్ 18న కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సియా గోయల్, ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ చౌదరితో కలిసి లోహగడ్ కోట సమీపంలోని లోయలోకి తోసి చంపేశారు. పెళ్లి ఇష్టం లేకపోవడం, నిశ్చితార్థం రద్దు చేస్తే ఎదురయ్యే పరిణామాల భయంతో ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వింటర్ హూడీ, హెడ్ సెట్ ధరించి కనిపించిన వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.
ఈ కేసు గురించి మీడియాలో బాగా ప్రచారం జరగడంతో చాలా మంది పర్యాటకులు ప్రత్యేకంగా నేరం జరిగిన ప్రదేశాన్ని చూడాలనే ఉద్దేశంతో లోహగడ్ కోటకు వెళ్తున్నారు. కొందరు తమ ట్రెక్కింగ్ ప్లాన్లను మార్చుకుని ఈ కోటను సందర్శిస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడి గైడ్ లను హత్య జరిగిన కచ్చితమైన ప్రాంతాన్ని చూపించాలని అడుగుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. సోషల్ మీడియాలో కొందరు ఆ ప్రాంతాన్ని ‘సియా పాయింట్’ అని పిలుస్తున్నారు. ఒక విషాద ఘటన కారణంగా లోహగడ్ కోటకు పర్యాటకుల రద్దీ పెరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: చెట్లకూ ‘జీవించే హక్కు’.. చిన్న పట్టణం సంచలన నిర్ణయం!