Konkan Railway Merge In Indian Railways: కొంకణ్ రైల్వే భారతీయ రైల్వేలో విలీనం కాబోతోంది. ఈ విలీన ప్రక్రియకు అంగీకారం తెలుపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర రైల్వేశాఖకు లేఖ రాసింది. కొంకణ్ రైల్వేలో భాగస్వాములుగా ఉన్న గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇప్పుడు మహా సర్కారు కూడా ఓకే చెప్పడంతో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(KRCL) భారతీయ రైల్వేలో అధికారికంగా విలీనం కాబోతోంది.
1990లో కొంకణ్ రైల్వే ఏర్పాటు
పశ్చిమ కనుమల ద్వారా రైల్వే లైన్లను నిర్మించడం కష్టతరం అయినప్పటికీ, ఆ పనిని పూర్తి చేసేందుకు కొంకణ్ రైల్వే (KR) 1990లో రైల్వే మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. జనవరి 1998లో ఈ సంస్థ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళలోని తీర ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు అయ్యింది. కొంకణ్ తీరం అంతటా సరుకులతో పాటు ప్రయాణీకుల రవాణాకు అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు. మొత్తం 741 కి.మీ పొడవులో విస్తరించి ఉన్న ఈ రైల్వే లైన్, పలు రాష్ట్రాల్లోని ప్రధాని నగరాలు, పట్టణాలను అనుసంధానిస్తూ, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది.
జాయింట్ వెంచర్ గా కొంకణ్ రైల్వే
కొంకణ్ రైల్వే అనేది జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 51% వాటా కలిగి ఉంది. మహారాష్ట్ర 22%, కర్ణాటక 15%, గోవా, కేరళ రాష్ట్రాలు 6% చొప్పున వాటాను కలిగి ఉన్నాయి. ఈ లైన్ 1990ల ప్రారంభంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇది ఒక ప్రధాన మార్గంగా కొనసాగుతోంది. భారతీయ రైల్వేలో ప్రత్యేక సంస్థగా ఉంది.
ఇండియన్ రైల్వేలో ఎందుకు విలీనం అవుతుంది?
ఈ రైల్వే మార్గం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కొంకణ్ రైల్వే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. తక్కువ ఆదాయం, పెరుగుతున్న మౌలిక సదుపాయాల డిమాండ్లతో, కంపెనీ విస్తరణకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సంస్థను నిర్వహించం కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో కొంకణ్ రైల్వేను ఇండియన్ రైల్వేలో విలీనం చేయాలని ఆయా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇప్పటికే గోవా, కేరళ, కర్నాటక ప్రభుత్వాలు ఇండియన్ రైల్వేలో విలీనానికి అంగీకరించగా, తాజాగా మహారాష్ట్ర కూడా ఓకే చెప్పింది.
Read Also: రైల్వే టికెట్ల రిజర్వేషన్ వెనుక ఇంత కథ ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!
విలీనానికి 2 షరతులు పెట్టిన మహారాష్ట్ర
కొంకణ్ రైల్వేను ఇండియన్ రైల్వేలో విలీనానికి అంగీకరిస్తూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క లేఖ ద్వారా తెలియజేశారు. ఈ విలీనం ఈ మార్గంలో రైల్వే అభివృద్ధికి ముందడుగు కాబోతోందన్నారు. రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, పర్యాటకం రంగం బలోపేతం కావడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. అయితే, రెండు షరతులతో కొంకణ్ రైల్వేను ఇండియన్ రైల్వేలో విలీనం చేయనున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. కొంకణ్ రైల్వే పేరును అలాగే కొనసాగించడంతో పాటు మహారాష్ట్రకు రూ. 394 కోట్లు చెల్లించాలని కోరారు. ఈ రెండు షరతులకు రైల్వేశాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: హైదరాబాద్ నుంచి ఆ సిటీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!