Maharashtra Train Passengers: ప్రయాణీకులు తరచుగా హడావిడి కారణంగా రైళ్లలో లగేజీని మర్చిపోతుంటారు. బ్యాగులు, బ్రీఫ్ కేసులు, ఇతర వస్తువులను వదిలి వెళ్తుంటారు. ఈ వస్తువులను రైల్వే సిబ్బంది తీసుకెళ్లి ప్రత్యేక గదిలో ఉంచుతారు. వాటి యజమానులు వచ్చి, తమ వస్తువులను మర్చిపోయినట్లు రైల్వే అధికారులకు చెప్తే, చట్టపరమైన ప్రొసీజర్ పూర్తి చేసిన తర్వాత తిరిగి ఇస్తారు. రైళ్లలో ప్రయాణీకులు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేందు కోసం రైల్వే సంస్థ ‘ఆపరేషన్ అమానత్’ను చేపట్టారు. దీని ద్వారా ప్రయాణీకులు రైళ్లలో మర్చిపోయిన విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఆభరణాలు, నగదు మొదలైన వాటిని తిరిగి ఇస్తారు.
సెంట్రల్ జోన్ లో రూ. 5.22 కోట్ల విలువైన లగేజీ స్వాధీనం
‘ఆపరేషన్ అమానత్’ ద్వారా సెంట్రల్ జోన్ పరిధిలో ఈ ఏడాది నవంబర్ వరకు రూ. 5.22 కోట్ల విలువైన 1,491 వస్తువులను రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. అయితే, రైళ్లలో వస్తువులను మర్చిపోయే వారిలో ఎక్కువగా ఏ రాష్ట్ర ప్రయాణీకులు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మహారాష్ట్రలోనే ఎక్కువ..
ఈ ఏడాది నవంబర్ 2024 వరకు ఉన్న డేటా ప్రకారం మహారాష్ట్రలో ప్రయాణీకులు ఎక్కువగా తమ వస్తువులను మర్చిపోతున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. అత్యంత ముఖ్యమైన ల్యాప్ టాప్ లు కూడా మర్చిపోతున్నట్లు గుర్తించారు. సెంట్రల్ రైల్వేలోని ఐదు జోన్లలో ముంబై డివిజన్ ప్రయాణీకులు ఎక్కువగా లగేజీని మర్చిపోయారు. ఈ డివిజన్ లో జనవరి నుంచి నవంబర్ వరకు రూ.2.55 కోట్ల విలువైన 649 వస్తువులు దొరికాయి. భూసావల్ డివిజన్ 1.07 కోట్ల విలువైన 261 వస్తువులు లభించిన రెండో స్థానంలో నిలిచింది. నాగ్ పూర్ డివిజన్ లో రూ.67.89 లక్షల విలువైన 322 వస్తువులు రికవరీ అయ్యాయి. షోలాపూర్ డివిజన్ లో రూ.51.86 లక్షల విలువైన 88 వస్తువులు, పుణె డివిజన్ లో రూ.39.73 లక్షల విలువైన 171 వస్తువులు దొరికినట్లు అధికారులు తెలిపారు.
Read Also: వద్దన్నా వినని అయ్యప్ప భక్తులు, కేసు ఫైల్ చేసిన రైల్వే పోలీసులు
గతంతో పోల్చితే పెరిగిన వస్తువుల రికవరీ
రైల్వే అధికారుల లెక్కల ప్రకారం, నవంబర్-2023లో రూ. 4.12 కోట్ల విలువైన 1,494 వస్తువులు రికవరీ చేయబడ్డాయి. వీటిలో బ్యాగులు, మొబైల్ ఫోన్లు, పర్సులు, ల్యాప్ టాప్ లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ ఏడాది ఏకంగా రూ.5.22 కోట్లకు పైగా విలువైన వస్తువులు రికవరీ అయ్యాయి. వీటిలో నవంబర్-2024 నెలలోనే రూ.43.72 లక్షల విలువైన 157 వస్తువులు రికవరీ అయ్యాయి. వీటన్నింటినీ ప్రత్యేక గదిలో భద్రపర్చుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తగిన ఆధారాలతో వచ్చి ప్రయాణీకులు తమ లగేజీని తీసుకెళ్లవచ్చని వెల్లడించారు. వీలైనంత త్వరగా లగేజీని మర్చిపోయిన విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాలని సూచించారు. ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంత సేఫ్ గా దొరికే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: రాధేశ్యామ్ లో పూజా హెగ్డేలా రైలుకి వేలాడిన యువతి, రెప్పపాటులో ఘోరం!