Indian railways: రైల్వే భద్రత విషయంలో అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, దుండగుల దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. రైల్వే ప్రమాదాలు జరగాలనే ఉద్దేశంతో పట్టాలపై ఇనుమ వస్తువులను ఉంచడం, రాళ్లను అడ్డుగా పెట్టడం, ఇసుక పోయడం లాంటి పనులు చేస్తున్నారు. తాజాగా చెన్నై సమీపంలోని పట్టాలకు ఉన్న బోల్ట్ లను తొలగించారు. అధికారులు వెంటనే ఈ విషయాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు రైల్వే పోలీసులు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఇవాళ తెల్లవారుజామున చెన్నై సమీపంలో ప్రధాన టెర్మినస్ వైపు వెళ్లే రైళ్లు ఉపయోగించే ఫాస్ట్ యుపి లైన్ లోని ట్రాక్-చేంజింగ్ మెకానిజానికి సంబంధించిన బోల్డులను తొలగించినట్లు అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున 1.15 గంటలకు సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో తిరువలంగడు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ అలైన్ మెంట్ ను నియంత్రించే పాయింట్ మెషిన్ కు సంబంధించి కీలకమైన నట్ లు, బోల్ట్ లు కనిపించడం తనిఖీ సిబ్బంది గుర్తించారు. ఉత్తర తమిళనాడులోని ఈ ప్రాంతం చెన్నై-అరక్కోణం-బెంగళూరు రైల్వే కారిడార్ లో కొనసాగుతుంది. అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి.
వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది
రైలు పట్టాలకు సంబంధించిన బోల్డ్ లను తొలగించిన విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు వెల్లడించారు తనిఖీ సిబ్బంది. వెంటనే టెక్నికల్ టీమ్ స్పాట్ కు చేరుకుంది. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఫాస్ట్ UP లైన్ నుంచి రెండు నట్స్, బోల్ట్‌లు తొలగించబడ్డాయని గుర్తించారు. అటు స్లో UP లైన్ (స్టేషన్లలో ప్యాసింజర్, లోకల్ రైళ్లు ఆగే ట్రాక్)కు సంబంధించి ఒక నట్, బోల్ట్ తొలగించబడిందని గుర్తించారు. ఒకవేళ ఎవరూ గమనించకపోతే కచ్చితంగా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైల్వే వెల్లడించారు. ఫాస్ట్ UP లైన్ చివరి సారిగా రాత్రి 11:30 గంటలకు ఉపయోగించబడింది. ఈ బోల్ట్ లు తొలగించిన విషయాన్ని గుర్తించిన కాసేపటి రైలు ప్రయాణించాల్సి ఉంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రైళ్ల రాకపోకలు నిలిపేశారు.
Read Also: ఇండియాలో పట్టాలెక్కిన మొదటి రైలు ఇదే.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందంటే?
ఉద్దేశపూర్వకంగానే బోల్ట్ లు తొలగించినట్లు అనుమానం
అప్పుడప్పుడు రైల్వే రాకపోకల సమయంలో ఒకటి రెండు బోల్ట్ లు ఊడిపోతాయని, ఒకేసారి ఇన్ని ఊడిపోవడం సాధ్యం కాదంటున్నారు. దుండగులు బోల్ట్ లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే తిరువలంగడు స్టేషన్ మాస్టర్ ప్యానెల్‌పై రెడ్ సిగ్నల్ వేసి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఒకవేళ సిగ్నల్ క్లియర్ అయి ఉంటే, రైలును లూప్ లైన్ పైకి వెళ్లి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే ప్రమాదాలకు కారణం అయ్యే పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ లు క్లోజ్ చేసేది ఎప్పుడు? పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయి?