Beautiful Roads in India: ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు. కొన్ని రహదారుల్లో వెళ్తుంటే, మార్గంలో కనిపించే ప్రకృతి అందాలే అసలైన అనుభూతిని ఇస్తాయి. పర్వతాలు, లోయలు, అడవులు, సముద్ర తీరాలు, జలపాతాలు ఎన్నో అద్భుతమైన దృశ్యాల మధ్య సాగే రోడ్డు ప్రయాణాలు మనసును ఆకట్టుకుంటాయి. దేశంలో ఇలాంటి అందమైన రోడ్డు మార్గాలకు కొదవ లేదు. ముఖ్యంగా రోడ్ ట్రిప్స్ ఇష్టపడేవారికి కొన్ని మార్గాలు జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలనిపించేలా చేస్తాయి. అలాంటి అందమైన రూట్లలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మనాలి-లేహ్ హైవే దేశంలోని అత్యంత అందమైన రోడ్ ట్రిప్ మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హిమాలయ పర్వతాల మధ్య సాగే ఈ ప్రయాణంలో ఎత్తైన మంచు కొండలు, లోతైన లోయలు, విశాలమైన పర్వత ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ రూట్‌లో ప్రయాణం ఒకవైపు సాహసాన్ని ఇస్తే.. మరోవైపు ప్రకృతి అందాలను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాల మధ్య రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారికి విశాఖపట్నం-అరకు మార్గం మంచి ఆప్షన్. తూర్పు కనుమల మధ్య సాగే ఈ రూట్‌లో దట్టమైన అడవులు, కొండలు, లోయలు, కాఫీ తోటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఘాట్ రోడ్డుపై మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంటే చుట్టూ కనిపించే పచ్చదనం ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.
ముంబై నుంచి గోవా వెళ్లే మార్గం రోడ్ ట్రిప్ లవర్స్ కు ఎంతో ఇష్టం. కొంకణ్ ప్రాంతం, పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణంలో పచ్చని చెట్లు, నదులు, చిన్న జలపాతాలు కనిపిస్తాయి. మార్గమధ్యంలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణించడానికి ఈ రూట్ ఎంతో బాగుంటుంది.
చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్లే ఈస్ట్ కోస్ట్ రోడ్ కూడా అందమైన రోడ్డు ప్రయాణాలకు ప్రసిద్ధి. ఒకవైపు బంగాళాఖాతం.. మరోవైపు పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. సముద్రానికి దగ్గరగా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఈ రూట్ లో ఉదయం, సాయంత్రం చేసే జర్నీ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.
మైసూర్ నుంచి ఊటీ వెళ్లే మార్గం బాందిపూర్ అటవీ ప్రాంతం గుండా సాగుతుంది. దట్టమైన అడవులు, కొండలు, పచ్చని వాతావరణం ఈ రూట్ ప్రత్యేకత. ఏనుగులు, జింకలు లాంటి వన్యప్రాణులు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే, అటవీ ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
ఈశాన్య భారత ప్రకృతి అందాలను చూడాలనుకునేవారికి గువహాటి-తవాంగ్ మార్గం మంచి అనుభూతిని ఇస్తుంది. పర్వతాలు, జలపాతాలు, మంచు ప్రాంతాలు, బౌద్ధ మఠాలు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణ. మార్గంలో మారే ప్రకృతి దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.
ముంబై-పూణే ఎక్స్ ప్రెస్‌వే దేశంలోని ప్రముఖ ఆధునిక రహదారుల్లో ఒకటి. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ మార్గంలో కొండలు, సొరంగాలు, పచ్చని లోయలు కనిపిస్తాయి. వేగంగా ప్రయాణించేందుకు అనువుగా ఉన్నప్పటికీ.. మార్గంలోని ప్రకృతి దృశ్యాలు రోడ్డు జర్నీకి ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి.
Read Also: వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!