Pakistan First Bullet Train: పాకిస్తాన్ లో ఫస్ట్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. 2030 నాటికి లాహోర్- కరాచీ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 20 గంటల నుంచి కేవలం 5 గంటలకు తగ్గించే లక్ష్యంతో పాకిస్తాన్ రైల్వే మొదటి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కింద ఏకంగా 6.8 బిలియన్ల మెయిన్ లైన్-1 (ML-1) అప్ గ్రేడ్ లో భాగమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన రవాణా చొరవగా ఆదేశ రైల్వే అధికారులు ప్రశంసిస్తున్నారు.
చైనా సహకారంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం
తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి ప్రణాళికలను ప్రకటించారు. ఈ హై-స్పీడ్ రైలు పాకిస్తాన్ పాత రైల్వే నెట్ వర్క్ ను ఆధునీకరించడమే కాకుండా విమాన ప్రయాణం కంటే చౌకైన, వేగవంతమైన ప్రత్యామ్నాయా రవాణా సౌకర్యాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో సహా చైనా సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్ల వెల్లడించారు.
ప్రయాణం, వాణిజ్యానికి గేమ్ ఛేంజర్
ఈ బుల్లెట్ రైలు కరాచీ- లాహోర్ మధ్య 1,215 కిలోమీటర్ల మార్గంలో నడుస్తుంది. హైదరాబాద్, ముల్తాన్, సాహివాల్ లలో ప్రధాన స్టాప్ లు ఉంటాయి. గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఈ రైలును రూపొందిస్తున్నారు. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 5 గంటలకు తగ్గిస్తుంది. గ్రీన్ లైన్ వంటి ఎక్స్ ప్రెస్ సర్వీసులలో ప్రస్తుతం రెండు నగరాల మధ్య ప్రయాణానికి సుమారు 18 నుంచి 22 గంటలు పడుతోంది.
బుల్లెట్ రైలు టికెట్ ధరలు ఎలా ఉంటాయంటే?
బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు మొదలు కాకముందే రైలు టికెట్ ధరలపై చర్చ జరుగుతోంది. ఎకానమీ, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు PKR 5,000, 10,000 మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇది సగటు విమాన ఛార్జీలు (PKR 20,000—30,000) కంటే చాలా తక్కువ అని అభిప్రాయపడుతున్నారు. ఈ బుల్లెట్ రైలు విద్యార్థులు, నిపుణులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు రైల్వే అధికారులు.
డబుల్ ట్రాక్ ల నిర్మాణం
ML-1 అప్ గ్రేడ్ లో డబుల్ ట్రాక్‌లు వేయడం, పాత వంతెనలను పునర్నిర్మించడం ద్వారా పాకిస్తాన్ పురాతన రైలు మౌలిక సదుపాయాల స్థానంలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు గంటకు 60- 105 కి.మీ.లకు పరిమితం చేయబడ్డాయి.
అటు ఈ సంవత్సరం ప్రారంభంలో, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ ఇప్పటికే లాహోర్-రావల్పిండి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతిపాదిత రైలు లింక్ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం రెండున్నర గంటలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణ సమయం 4 నుంచి 5 గంటలు పడుతుంది.
లాహోర్- కరాచీ బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి..
⦿ సాధ్యాసాధ్యాల అధ్యయనం: జూన్ 2025లో పూర్తయింది.
⦿ నిర్మాణం: 2026లో ప్రారంభమవుతుంది.
⦿ 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
⦿ పరీక్షా దశ: 2029కి షెడ్యూల్ చేయబడింది.
⦿ ప్రారంభం: 2030లో అంచనా.
Read Also: 142 వంతెనలు, 48 సొరంగాలు.. ఐజ్వాల్ కు తొలి రైలు వచ్చేస్తోంది!