Kuala Lumpur Kochi Flight: కౌలాలంపూర్ నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో ఊహించని ఘటన జరిగింది. విమానం కొచ్చి విమానాశ్రయానికి సమీపంలో ఉండగా, ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ముందుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు ఉన్న కిటికీ ప్యానెల్ ను పగలగొట్టి, ఆ తర్వాత తలుపును తెరవడానికి ప్రయత్నించడంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి బాటిక్ ఎయిర్‌కు చెందిన OD231 విమానంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కౌలాలంపూర్ నుంచి కొచ్చికి బయలుదేరిన విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అప్పటికే చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏరియా నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత గాలి వేగంగా బయటకు వెళ్తున్నట్లుగా అనిపించడంతో ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక భయపడిపోయారు. కొంతమంది ప్రయాణికులు వెంటనే అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించారు. ఓ వ్యక్తి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీ ప్యానెల్‌ను పగలగొట్టి, తలుపును లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. మ్యాటీ అనే ప్రయాణికురాలు సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి వివరించారు. విమానం కొచ్చి నెడుంబస్సేరి ప్రాంతానికి చేరుకోవడానికి సుమారు అరగంట సమయం మాత్రమే ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఒక్కసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి భారీ శబ్దం వినిపించిందని, దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారని చెప్పారు. కొంతమంది ప్రయాణికులు వెంటనే స్పందించి, ఆ వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు.
మరో ప్రయాణికుడు కూడా ఈ ఘటన తన జీవితంలో అత్యంత భయానకమైన ఇన్సిడెంట్ గా చెప్పుకొచ్చాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీ ప్యానెల్ లో కొంత భాగం పగిలిపోయిందన్నాడు. ఆ సమయంలో తమ ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నట్లు చెప్పాడు. పరిస్థితిని గమనించిన వెంటనే బాటిక్ ఎయిర్ సిబ్బంది, కొంతమంది ప్రయాణికుల సహాయంతో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
36 ఏళ్ల జంషీర్ అథానిక్కల్ అనే వ్యక్తి 12A సీటులో కూర్చున్నాడు. ప్రయాణికులు, విమాన సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిసినప్పటికీ అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొంతమంది ప్రయాణికులను కూడా అతను బెదిరించినట్లు FIRలో పేర్కొన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి 11.05 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. డోర్ కు కొంత డ్యామేజ్ అయినా బాటిక్ ఎయిర్ విమానం రాత్రి 11.10 గంటల ప్రాంతంలో కొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది విమానంలోకి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: దేశంలో ఫాస్టెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. సికింద్రాబాద్– విశాఖ ఎక్స్ ప్రెస్ స్పీడ్ ఎంతో తెలుసా?