Prayagraj Division Fine: చాలా మంది ప్రయాణీకులు సుదూర ప్రయాణాలు చేసే సమయంలో హోంఫుడ్స్ తీసుకెళ్తుంటారు. ప్రయాణ సమయంలో బయటి ఫుడ్స్ కొనడం కంటే, ఇంటి నుంచి తీసుకెళ్లిన ఫుడ్స్ తినడం మంచిదని భావిస్తారు. అందుకే, ఇంట్లో తయారు చేసుకుని తీసుకెళ్తారు. అయితే, మీరు కూడా ఇంటి ఫుడ్స్ క్యారీ చేస్తున్నట్లు అయితే, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నార్త్ సెంట్రల్ రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ లో ఇంటి ఫుడ్స్ తీసుకెళ్తున్న చాలా మంది ప్రయాణీకుల మీద రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంతకీ అలా ఎందుకు చేశారంటే..
ఆహారాన్ని పడేసినా, స్మోకింగ్ చేసినా..
రైల్లో ప్రయాణించే చాలా మంది ప్యాసింజర్లు ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిన్న తర్వాత మిగిలిన ఫుడ్ ను రైల్లో లేదంటే రైల్వే స్టేషన్ లో పారేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు రైల్వే అధికారులు. తాజాగా రైల్వే ప్రయాణీకులకు మెరుగైన, శుభ్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రయాగ్ రాజ్ డివిజన్ లో ఇంటెన్సివ్ చెకింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ ప్రచారంలో ఆహారాన్ని పడేసే వ్యక్తులతో పాటు స్మోకింగ్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 26,964 మంది ప్రయాణికుల నుండి మొత్తం రూ. 32,63,050 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ఇందులో చెత్త వేసిన 26,253 మంది ప్రయాణికుల నుంచి రూ. 31,23,925 ఫైన్ వసూలు చేయగా, పొగతాగిన 711 మంది ప్రయాణీకుల నుండి రూ. 1,39,125 జరిమానా విధించారు.
ప్రయాణీకులలో మార్పు తెచ్చేందుకే!
ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ నిర్వహించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు మంచి ఆహారం, పరిశుభ్రమైన నీరు, శుభ్రమైన టాయిలెట్ల లాంటి సౌకర్యాలను అందించడానికి ప్రయాగ్ రాజ్ డివిజన్ కట్టుబడి ఉందన్నారు. అలాగే, టికెట్ లేని ప్రయాణాన్ని అడ్డుకునేందు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రైళ్లు, స్టేషన్లను శుభ్రంగా ఉంచడానికి ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
Read Also: ట్రైన్ టాయిలెట్ నుంచి మంటలు.. వాడు చేసిన పనికి ప్రయాణీకులు పరుగులు!
రైల్వే నిబంధనలు ఏం చెప్తున్నాయంటే?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రైళ్లు, స్టేషన్ ప్రాంగణంలో చెత్త వేయడం, ధూమపానం చేయడం నేరం. అలా చేసే ప్రయాణీకులకు జరిమానా, జైలు విధించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాగ్ రాజ్ డివిజన్ లోని అన్ని రైళ్లు, స్టేషన్లను శుభ్రంగా ఉంచాలని, ధూమపానం మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా, అసౌకర్యం, జరిమానాలను నిరోధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణీకులకు అవగాహన కల్పించడానికి, రైల్వే నియమాలను పాటించేలా చేయడానికి ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రచారాలు కొనసాగుతాయని వెల్లడించారు. అందకే, ఇంటి ఫుడ్స్ తీసుకెళ్లే ప్రయాణీకులు జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: 2 గంటల పాటు రైలును ఆపేసిన ప్రయాణీకులు.. ఎక్కనే ఎక్కమంటూ ఇంజిన్ ముందు హంగామా!