Indian Railways: కన్ఫర్మ్ టికెట్ లేని వాళ్లకు రిజర్వేషన్ బోగీల్లోకి అనుమతి లేదని రైల్వేశాఖ ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కన్ఫర్మేషన్ టికెట్ ఉన్నవాళ్లకు లేని వాళ్లు బెర్త్ ఇవ్వని ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉన్నా RACలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణీలు బెర్త్ ఇవ్వకుండా తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఆ పోస్టు వైరల్ కావడంతో రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రైలు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కన్ఫర్మ్ అయిన సైడ్ అప్పర్ బెర్త్ ఉన్నప్పటికీ RAC (రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్) టికెట్లు ఉన్న తోటి ప్రయాణికులు తనను వేధించారని రెడ్డిట్ లో పోస్టు పెట్టాడు. “నాకు ఇండోర్ నుంచి ఉజ్జయిని వరకు ధృవీకరించబడిన టికెట్ ఉంది. సీట్ నెంబర్ 63, 64 మాకు కన్ఫర్మ్ అయ్యాయి. అప్పటికే కొంత మంది RAC టికెట్ ఉన్న ప్రయాణీకులు మా బెర్త్ లో కూర్చొని ఉన్నారు. ఆ సీట్లు మావి అని చెప్పినా వినలేదు. వెళ్లి వేరొకచోట కూర్చోవాలని మాతో వాదనకు దిగారు. వారి వాదనతో మా కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. డబ్బులు ఖర్చు చేసి కన్ఫర్మ్ టికెట్ పొందినా, ప్రయాణం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు” అని చెప్పుకొచ్చాడు.
టీసీకి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన
అటు ఈ విషయాన్ని తాను టీసీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సదరు ప్రయాణీకుడు బాధపడ్డాడు. “టీటీఈ మా కోచ్ లోకి వచ్చినప్పడు తనకు విషయం చెప్పాను. కానీ, ఆయన మాకు బెర్త్ ఇప్పటించాల్సింది పోయి.. సర్దుకుపోవాలంటూ నాకే నీతిబోధ చేశాడు. అన్ని చోట్ల నిబంధనల ప్రకారం వెళ్లడం సాధ్యం కాదన్నారు. చట్టబద్దంగా నా దగ్గగ కన్ఫర్మ్ టికెట్స్ ఉన్నా, నేను నా బెర్త్ ను పొందలేకపోయాను. ఈ ఎన్స్ పీరియెన్స్ నాకు బాధతో పాటు నిరాశకు గురి చేసింది” అని సదరు ప్రయాణీకుడు తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
Read Also: హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!
నెటిజన్లు ఏమంటున్నారంటే?
అటు ఈ ఘటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ రోజుల్లో చెప్పే మాటలకు అసలు వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదన్నారు. “ఒకవేళ టీసీ కరెక్ట్ గా తన బాధ్యత నిర్వర్తించి ఉంటే, మీకు ఈ రోజు ఈ పోస్టు పెట్టే అవసరం ఉండేది కాదు. వాళ్లు కూడా కరప్ట్ అవుతున్నారు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “మీరు ఈ విషయం గురించి గట్టిగా పోరాడితే సదరు టీసీ మీద చర్యలు తీసుకోవడంతో పాటు మీకు కలిగిన అసౌకర్యానికి తగిన పరిహారం పొందే అవకాశం ఉంటుంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Read Also: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బు వాపస్, వెంటనే ట్రై చేయండి!